భూమన విచారణపై – తిరుపతి ఎంపీ గరం గరం
(ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, అందులో భాగంగానే తమ పార్టీ సీనియర్ నేత, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని పోలీసులకు విచారణకు పిలిచారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి (MaddilaGurumurthy) విమర్శించారు. టీటీడీ గోశాల గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వివరాలు బయట పెట్టారనే కారణంతో ఇవాళ భూమనను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకు పిలిచారు. పోలీసుల విచారణకు వెళ్లిన భూమన వెంట, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా నడిచారు.
ఎస్వీ యూనివర్సిటీ వద్ద మీడియాతో డాక్టర్ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీటీడీలో గోమాతల మరణాలపై భూమన ఆధారాలతో సహా బయటపెట్టారని ఆయన గుర్తు చేశారు. తప్పుల్ని సరిదిద్దుకోడానికి, వాస్తవాల్ని బయటపెట్టిన భూమన (Bhumana) ను విచారణ పేరుతో వేధించడం సబబు కాదని ఆయన తప్పు పట్టారు.
అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు, అందుకు విరుద్ధంగా టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో వేర్వేరు సంఖ్యలు చెప్పారన్నారు. గోవుల మరణాలపై పాలకుల్లోనే స్పష్టత లేదని ఆయన గుర్తు చేశారు. విచారణ పేరుతో గంటల తరబడి విచారించడం తగదని గురుమూర్తి మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, అలాగే నకిలీ మద్యం తయారీ తదితర అంశాలపై తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇలాంటి వాటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ (Diversion Politics) లో భాగంగానే భూమనను విచారణకు పిలిచారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన పద్ధతుల్ని మానుకుని, హామీల అమలుకు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.