Tirumala | బ్రహ్మోత్సవాలకు 14న అంకురార్పణ…
15 నుంచి ఉత్సవాలు ప్రారంభం
Tirumala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాలు, ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెలలో పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, 5న శిక్యోత్సవం నిర్వహించనున్నారు. 13న బలరామ జయంతి, వరాహ జయంతి వేడుకలు జరగనున్నాయి. అనంతరం 14న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న అత్యంత విశేషమైన గరుడ సేవ నిర్వహించనున్నారు. ఈ సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది.
20న శ్రీవారి స్వర్ణరథం, 22న రథోత్సవం నిర్వహించనున్నారు. 23న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాలు ముగియనున్నాయి. సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి, అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో వరుసగా జరిగే ఈ విశేష పర్వదినాలు, బ్రహ్మోత్సవాలతో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.
