టిల్‌ హెల్త్‌కేర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షల పరిహారం డిమాండ్

తిరుపతి, ఆంధ్రప్రభ : శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన భారీ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడిన ఘటనకు యాజమాన్య బాధ్యతారాహిత్యమే కారణమని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. బాధ్యులైన పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు ఎస్. జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యం, బాధ్యతారాహిత్య వైఖరి వల్లే ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని కందారపు మురళి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కూడా ఈ ఘటనకు కారణమని విమర్శించారు. తిరుపతి జిల్లాలో గతంలోనూ పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినా బాధ్యులైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కనీస చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. పరిశ్రమల్లో రక్షణ చర్యలు పెంచి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్స్‌తో కార్మికుల రక్షణ బలహీనపడిందని ఆయన పేర్కొన్నారు. బాధిత కార్మికులు, వారి కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని నాయకులు కోరారు. ధర్నాలో సీఐటీయూ నగర నాయకులు బుజ్జి, పార్థసారథి, వేణు, ఎన్.డి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.