ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు!

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు!

  • పోలింగ్‌ విధుల్లో 1,800 మంది పోలీసు అధికారులు, సిబ్బంది..
  • 1,196 పోలింగ్‌ ప్రాంతాల్లో 2,004 కేంద్రాలు.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
  • డ్రోన్లు, సీసీ కెమెరాలు, బాడీ వార్న్‌ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ

శ్రీకాకుళం, నవంబర్‌ 4 (ఆంధ్రప్రభ బ్యూరో): జిల్లాలో గురువారం (నవంబర్‌ 5) జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. పోలింగ్‌ బందోబస్తు విధుల కోసం మొత్తం 1,800 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

1,800 మందితో భద్రత

జిల్లావ్యాప్తంగా 1,196 పోలింగ్‌ ప్రాంతాల్లో 2,004 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బందోబస్తు బాధ్యతలను ఎస్పీ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. విధుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, 65 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతోపాటు పోలీసు అనుబంధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

గత ఎన్నికల అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ ప్రాంతాలను గుర్తించారు. అతి సమస్యాత్మక విభాగంలో 129 పోలింగ్‌ ప్రాంతాలు, 308 కేంద్రాలు.. సమస్యాత్మక విభాగంలో 220 పోలింగ్‌ ప్రాంతాలు, 449 కేంద్రాలను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించనున్నారు. రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు, రిజర్వ్‌ పార్టీలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షించనున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా

పోలింగ్‌ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, బాడీ వార్న్‌ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించనున్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందే ప్రత్యక్ష దృశ్యాలను జిల్లా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షించనున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఎస్పీ వెల్లడించారు.

పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు నిషేధం

ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల లోపలికి మొబైల్‌ ఫోన్లు తీసుకురావద్దని ఎస్పీ సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు ఇచ్చే సూచనలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

ప్రచారంపై ఆంక్షలు.. ఉల్లంఘిస్తే చర్యలు

ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకే ముగిసిందని ఎస్పీ గుర్తుచేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రచారాలు, ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రచారకర్తలు, సంబంధం లేని వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు

అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులతోపాటు ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

100 మీటర్ల పరిధిలో ఆంక్షలు

పోలీసు యాక్ట్‌-30, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా గుంపులుగా గుమిగూడరాదని ఎస్పీ సూచించారు. పోలింగ్‌ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడడం, ప్రచారం నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

పోలింగ్‌ అనంతరం కూడా పటిష్ట భద్రత

పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామగ్రిని నిర్దేశిత స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే సమయంలో ప్రత్యేక పోలీసు భద్రత కల్పించనున్నారు. చిలకపాలెంలోని శివానీ ఇంజినీరింగ్‌ కళాశాల, టెక్కలిలోని ఐతమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, పలాస ప్రభుత్వ పాఠశాల, పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ నాలుగు కేంద్రాల వద్ద నిరంతర బందోబస్తుతోపాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. పోలింగ్‌ అనంతరం ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బృందాలతో నిఘా కొనసాగించనున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగి ఉండి, ప్రస్తుత ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ఇప్పటికే బైండోవర్‌ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు

ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, సమస్యలు, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

జిల్లా పోలీసు కంట్రోల్‌ రూమ్‌: 6309990933

డయల్‌ 112

జిల్లా పోలీసు ఎన్నికల సెల్‌: 630999092

శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం: 6309990804

కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం: 6309990805

టెక్కలి డీఎస్పీ కార్యాలయం: 6309990811

పోలింగ్‌ జరిగే మండలాల పరిధిలోని సంబంధిత పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలపై చర్యలు

ఎన్నికలకు సంబంధించి సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు, వదంతులు, విద్వేషపూరిత పోస్టులు ప్రచారం చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని సూచించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.