ig rajakumari| సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా!

సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా!

  • సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు
  • మొబైల్‌ బృందాలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లతో బందోబస్తు
  • అదనపు బలగాల మోహరింపునకు సిద్ధం: ఐజీ రాజకుమారి

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని ఐజీ రాజకుమారి తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల వారీగా భద్రత

ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాల వారీగా పోలింగ్‌ కేంద్రాల సున్నితత్వాన్ని అంచనా వేస్తున్నట్లు ఐజీ తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి అతి సున్నిత, సున్నిత, సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా విభజిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

మొబైల్‌ బృందాలు, ప్రత్యేక బలగాలు

ఎన్నికల సమయంలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు బందోబస్తుతోపాటు మొబైల్‌ పార్టీలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, రూట్‌ మొబైల్‌ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు రాజకుమారి వెల్లడించారు. అవసరాన్ని బట్టి అదనపు పోలీసు బలగాలను కూడా మోహరిస్తామని తెలిపారు.

సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా

నామినేషన్‌ కేంద్రాలతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ చెప్పారు. అవసరమైన చోట్ల వీడియో చిత్రీకరణ, సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు. నామినేషన్‌ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని రాజకుమారి తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.