భారత్‌–వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌కు పటిష్ట భద్రత

  • 2,200 మంది పోలీసులతో బందోబస్తు..
  • 408 సీసీటీవీ కెమెరాలతో నిఘ
  • ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు
  • డ్రోన్లతోనూ నిరంతర పర్యవేక్షణ
  • ప్రేక్షకులు, మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారత్‌–వెస్టిండీస్‌ జట్ల మధ్య అక్టోబరు 14న ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు సిద్ధం చేశారు.

మ్యాచ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 2,200 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించనున్నారు. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు షీ టీమ్స్‌, బాంబ్‌ డిటెక్షన్‌ బృందాలు, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయనున్నాయి. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

స్టేడియంలో ఏర్పాటు చేసిన 408 సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా భద్రతా పర్యవేక్షణ చేపట్టనున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లోనూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల రాకపోకలు, వాహనాల నిర్వహణపై పోలీసులు దృష్టి సారించనున్నారు.

మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు, మహిళలు, పిల్లలు, ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో మ్యాచ్‌ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.