మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు ..

  • అధికారులకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశం
  • బాసర ఆలయం, గోదావరి పరిసరాల్లో ఏర్పాట్ల పరిశీలన

బాసర, ఆంధ్రప్రభ: జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసరలో పర్యటించి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం బాసరలో పర్యటించిన కలెక్టర్‌ మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, గోదావరి నది పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా కార్యక్రమాల షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లన్నీ ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పార్కింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టి

మంత్రి పర్యటన నేపథ్యంలో పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమాలకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.

ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దు

ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. మంత్రి పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ ఈఈలు అనిల్, సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, బాసర ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్లు పవన్‌చంద్ర, శశిభూషణ్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.