వరదలో చిక్కుకున్న ముగ్గురు మహిళలు..
ప్రాణాలకు తెగించి కాపాడిన సీఐ సుబ్బనాయుడు
యడ్లపాడు, ఆంధ్రప్రభ: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పల్నాడు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఈ క్రమంలో యడ్లపాడు మండలం తిమ్మాపురం అండర్పాస్ వద్ద వరదలో చిక్కుకున్న ముగ్గురు మహిళలను చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బనాయుడు సాహసోపేతంగా రక్షించారు. చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్తున్న కారు డ్రైవర్ పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా తిమ్మాపురం అండర్పాస్లోకి వెళ్లాడు. వరద ఉధృతికి కారు నీట మునగడం ప్రారంభించడంతో డ్రైవర్ బయటపడి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. కారులో ఉన్న మహిళ ప్రాణభయంతో పైకప్పుపైకి చేరింది.
అదే సమయంలో స్కూటీపై వస్తున్న మరో ఇద్దరు మహిళలు కూడా వరదలో చిక్కుకుని కారు పైకప్పుపైకి చేరారు. ముగ్గురు మహిళలు వరద ప్రవాహంలో చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న సీఐ సుబ్బనాయుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పచి, నడురిస్థితి తీవ్రతను గుర్తించి నడుముకు తాడు కట్టుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకి ఈదుకుంటూ కారు వద్దకు చేరుకుని మహిళలకు ధైర్యం చెప్పి, సిబ్బంది సహకారంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సీఐ సాహసోపేత చర్యపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
