ట్రిపుల్‌ఐటీ కూడలిలో మూడు ఫ్లై ఓవర్లు.. రెండు డబుల్ డెక్కర్లు
- రూ.459 కోట్లతో భారీ ప్రాజెక్టు.. 2027 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
- 3.39 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాలు
- గచ్చిబౌలి-లింగంపల్లి మధ్య ఆరు లైన్ల అండర్‌పాస్
- ప్రథమ ప్రాధాన్యతగా ప్రాజెక్టు.. 98 శాతం భూసేకరణ పూర్తి
- ప్రయాణ సమయం 10-15 నిమిషాలు ఆదా అయ్యే అవకాశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : తాజాగా ఎనిమిది జిల్లాల పరిధికి విస్తరించిన రాజధాని నగరంలో ప్రతిష్టను చాటేలా అనేక ప్రాజెక్టులను ఎంచుకున్న సర్కారు నిర్ధేశిత కార్యాచరణతో ఒక్కొక్కటిగా పూర్తి చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఆవిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్యూర్ చట్టం అమలులో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు, హైడ్రా, వాటర్ బోర్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కార్యాలయాల ఏర్పాటు-ను వేగవంతం చేయాలని సూచించారు. నగర రవాణా, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు సిద్ధమైన హైదరాబాద్‌ను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజా ప్రభుత్వ ఎంచుకున్న ప్రాధాన్యతల్లో కీలకమైన ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో భారీ రహదారి ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ కూడలిని ఆధునిక రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ (సీఎంసీ) రూ.459 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఒకే కూడలిలో మూడు ఫ్లై ఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మిస్తుండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. వీటిలో రెండు డబుల్ డెక్కర్, 3 ఫ్లై ఓవర్లు కావడం విశేషం. నిర్మాణాలు పూర్తయితే ఐటీ కారిడార్‌లోని కీలక మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడంతో పాటు- వాహనదారులకు ప్రయాణ సమయం ఆదా కానుంది.
ఒకే కూడలిలో బహుళస్థాయి రహదారులు
ట్రిపుల్‌ఐటీ- కూడలిలో భూమిపై సాధారణ రహదారులు, భూగర్భంలో అండర్‌పాస్, మొదటి స్థాయిలో ఫ్లై ఓవర్లు , దానిపైన మరో రెండు స్థాయుల్లో పైవంతెనలు అందుబాటు-లోకి రానున్నాయి. వివిధ దిశల్లో ప్రయాణించే వాహనాలకు ప్రత్యేక మార్గాలు కల్పించడం ద్వారా కూడలిపై ఆధారపడే ట్రాఫిక్‌ను తగ్గించనున్నారు. ముఖ్యంగా ఐఎస్‌బీ, డీఎల్‌ఎఫ్, గచ్చిబౌలి, లింగంపల్లి మార్గాల్లో వాహనాల రాకపోకలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్‌బీ, డీఎల్‌ఎఫ్ రోడ్ల మధ్య ఇరువైపులా వాహనాలు ప్రయాణించేలా 720 మీటర్ల పొడవున నాలుగు లైన్ల ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఐదు పిల్లర్లను రెండు స్థాయిల్లో నిర్మాణాలను మోయగలిగేలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మొదటి స్థాయి ఫ్లై ఓవర్లపై మరో రెండు వక్రాకారపు పైవంతెనలను నిర్మించనున్నారు.
రెండు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు
ఐఎస్‌బీ వైపు నుంచి గచ్చిబౌలి కూడలి వైపు వెళ్లే వాహనాల కోసం 1.2 కిలోమీటర్ల పొడవున మూడు లైన్ల పైవంతెన నిర్మించనున్నారు. అదేవిధంగా డీఎల్‌ఎఫ్ రోడ్డు నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాల కోసం 948 మీటర్ల పొడవున మరో మూడు లైన్ల పైవంతెన అందుబాటులోకి రానుంది. ఈ రెండు మార్గాలను మొదటి స్థాయి ఫ్లై ఓవర్లు పిల్లర్లకు అనుసంధానిస్తూ నిర్మించడం వల్ల అదనపు భూసేకరణ అవసరం తగ్గనుంది. తద్వారా నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడంతో పాటు అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఒకే కూడలిలో వివిధ స్థాయుల్లో రహదారులు అందుబాటులోకి రావడం వల్ల వాహనాలు ఒకదానికొకటి అడ్డుపడే పరిస్థితులు తగ్గనున్నాయి. ప్రస్తుతం రద్దీ సమయాల్లో కూడలిలో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
గచ్చిబౌలి-లింగంపల్లి మధ్య అండర్‌పాస్..
్లఫఓవర్లతో పాటు- గచ్చిబౌలి, లింగంపల్లి మధ్య వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు 520 మీటర్ల పొడవున ఆరు లైన్ల అండర్‌పాస్‌ను నిర్మిస్తున్నారు. దీంతో పైవంతెనలపై ప్రయాణించే వాహనాలతో సంబంధం లేకుండా మరో మార్గంలో రాకపోకలు సాగించే అవకాశం ఉంటు-ంది. మొత్తం మీద ఈ ప్రాజెక్టులో భాగంగా 3.39 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచే సమయం తగ్గి, ప్రయాణికులకు సుమారు 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కార్యాలయాల రాకపోకల సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు, ఇతర వాహనదారులకు గణనీయమైన ఊరట లభించనుంది.
98 శాతం భూసేకరణ పూర్తి
ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను అధికారులు వేగవంతం చేశారు. ట్రిపుల్‌ఐటీ- కూడలికి సంబంధించి సుమారు 98 శాతం ఆస్తుల సేకరణ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియతో పాటు- కూల్చివేత పనులు కొనసాగుతున్నాయని సీసీపీ వెంకన్న తెలిపారు. గచ్చిబౌలి కూడలి నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వరకు 21 ఆస్తులను సేకరించినట్లు- వివరించారు. భూసేకరణలో కీలక దశ పూర్తికావడంతో నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు-న్నారు. ఈ ప్రాజెక్టును 2027 మే నాటికి అందుబాటు-లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టు-కున్నారు.
బయోడైవర్సిటీ–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అభివృద్ధి
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం సుమారు రూ.2 వేల కోట్ల విలువైన రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కమిషనర్ జి.సృజన తెలిపారు. ట్రిపుల్‌ఐటీ- కూడలితో పాటు- ఖాజాగూడ ప్రాంతంలో చేపడుతున్న పనులు కీలకమైనవని పేర్కొన్నారు. ట్రిపుల్‌ఐటీ- కూడలి వద్ద రహదారిని 200 అడుగుల మేర విస్తరిస్తున్నట్లు- వివరించారు. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కూడలి మీదుగా బయోడైవర్సిటీ- కూడలి వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. బయోడైవర్సిటీ- నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ర్ వరకు రహదారి అభివృద్ధి పనులను కూడా 2027 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు.
ఐటీ- ఉద్యోగులకు ప్రయాణ కష్టాలు దూరం?
ట్రిపుల్‌ఐటీ కూడలి ప్రాజెక్టు పూర్తయితే గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ర్, లింగంపల్లి ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానం మరింత మెరుగుపడనుంది. ఐటీ- సంస్థలు, వాణిజ్య కార్యాలయాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారి సామర్థం పెరగనుంది. ప్రస్తుతం రద్దీ సమయాల్లో కూడళ్ల వద్ద ఎదురుచూడాల్సి వస్తుండటంతో ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు-న్నారు. బహుళస్థాయి ఫ్లై ఓవర్లు , అండర్‌పాస్ అందుబాటులోకి వస్తే వాహనాల రాకపోకలు వేగవంతమై, ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. అయితే నిర్మాణ సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు, పనుల వేగం, నిర్వహణ వంటి అంశాలు కూడా కీలకం కానున్నాయి. మొత్తంగా, ట్రిపుల్ ఐటీ కూడలి ప్రాజెక్టు హైదరాబాద్ ఐటీ- కారిడార్‌లో రవాణా వ్యవస్థను కొత్త దశకు తీసుకెళ్లే అవకాశం ఉంది. నిర్ణీత గడువులో పనులు పూర్తయితే గచ్చిబౌలి పరిసర ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి గణనీయమైన ఉపశమనం లభించనుంది.
