AP | ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం..
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పశ్చిమ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది.
రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
