బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పోరుబాట

  • సెప్టెంబర్‌ 2 నుంచి 4 వరకు నిరసనలు..
  • రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై ఆందోళనలు

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు పోరుబాట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ లక్ష్మణచాంద మండల కన్వీనర్‌ కోరిపెల్లి కృష్ణారెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు వేర్వేరు అంశాలను ప్రస్తావిస్తూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 2న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ నిర్మల్‌ నియోజకవర్గ కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు బాకీ కార్డుల పంపిణీతో పాటు 425 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం రాంకిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 3న రైతుల సమస్యలపై పోరుబాట నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగం, సాగునీటి సమస్యలు, యూరియా కొరత, రైతు బీమా తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ధర్నా చేపట్టనున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 4న మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుపై నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, విద్యార్థులకు స్కూటీల వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.

మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను పెద్ద సంఖ్యలో సమీకరించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రణాళిక రూపొందించింది. మండలంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోరుబాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని కృష్ణారెడ్డి కోరారు.