ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, చట్టాన్ని అతిక్రమించే విచ్చలవిడిగా చెలరేగిన వారందరికీ శిక్ష తప్పదు అంటూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసునేని శివనాథ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రెడ్ బుక్ 2.0 త్వరలో మళ్లీ ప్రారంభం కాబోతోందని ఆయన హెచ్చరించారు. క్రిమినల్ పార్టీ గా పేరు పొందిన వైసీపీ లోని వారందరూ క్రిమినల్స్ అంటూ విమర్శించారు.
విజయవాడ ఖ్యాతి ప్రతిష్టను పెంచేలా ఉత్సవ్ నిర్వహిస్తుంటే ఫోర్జరీ సంతకాలతో కోర్టులో పిటీషన్లు వేసి కోర్టులను సైతం వైసీపీ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్సవ్ ను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అనేక కుట్రలు పన్నారని, దుర్గమ్మ ముందు వైసీపీ నేతలు కుట్రలు సాగలేదన్నారు.
55 రోజుల కోసం ప్రభుత్వం దేవదాయభూమి 44 లక్షల రూపాయలకు అద్దెకు తీసుకోవడం జరిగిందని, వైసిపి కుట్రలు,కుతంత్రాలతో విజయవాడ ఉత్సవ పై విషం చిమ్మారని, కోర్టులను కూడా ఆశ్రయించారన్నారు. దేవినేని అవినాష్,పేర్నినాని కొందరు వైసీపీ నేతలు విజయవాడ ఉత్సవ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
హిందూ విశ్వపరిషత్ పేరుతో పేర్ని నాని అనుచరులు కోర్టులో తప్పుడు పిటిషన్ వేశారని, దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, అంటూ పిటిషన్ వేయడం దుర్మార్గపు చర్య గా ఆరోపించారు. ఎవరి ప్రభుత్వంలో దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయో అందరికీ తెలుసన్న అయన గోడౌన్ లో బియ్యం మాయం చేసిన పేర్నినాని, దుర్గగుడి వెండి సింహాలు మాయం చేసిన వెల్లంపల్లి, భూ కబ్జాలు చేసిన అవినాష్ లు ఉత్సవ్ ఉన్న అడ్డుకునేందుకు కుట్రలు కుతంత్రాలతో కోర్టులను తప్పుదారి పట్టించారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో తాను ఒక్క సభ్యుడిని మాత్రమే నన్నారు. కానీ తాను 500 కోట్లు కబ్జా చేస్తున్నానంటూ బ్లూ మీడియా, జగన్ రెడ్డి వ్యాఖ్య లు చేయడం నీతిమాలిన చర్య అంటూ ఘాటుగా విమర్శించారు.
విజయవాడ నగర అభివృద్ధి తన ధ్యేయం అన్న ఆయన హత్యా రాజకీయాలు,రౌడీ రాజకీయాలు వైసిపి పార్టీకి వెన్నతో పెట్టిన విద్య గా చెప్పారు. దమ్ముంటే రండి…అభివృద్ధి,సంక్షేమం పై చర్చిద్దాం అని సవాల్ విసిరారు. మాది మంచి ప్రభుత్వం…ప్రజాప్రభుత్వం అని, అర్థరాత్రి అడ్డగోలు అరెస్టులు మాప్రబుత్వంలో ఉండవన్నారు. తప్పుచేసిన వారిని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం అన్న ఆయన వైసీపీ సైకోలకు ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదన్నారు.

