కాంగ్రెస్ పాలనలో పట్టణ అభివృద్ధి శూన్యం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పాలనలో పట్టణ అభివృద్ధి శూన్యంగా మారిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని 12వ వార్డులో గతంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావుడిగా శంకుస్థాపన చేసిన సుమారు రూ.30 లక్షల విలువైన సైడ్ డ్రెయిన్ పనులు నేటికీ ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పాలకుర్తి నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు.
తొర్రూరును మున్సిపాలిటీగా మార్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కేవలం శంకుస్థాపనలు మాత్రమే జరుగుతున్నాయని, పనులు మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, నాయకులు బిందు శ్రీనివాస్, 12వ వార్డు కౌన్సిలర్ ధరావత్ పద్మ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
