KHM | ఇది నాపై కాదు.. న్యాయవ్యవస్థపై దాడి : షేక్‌ లతీఫ్‌

ఖమ్మం లీగల్ : నేలకొండపల్లి వృద్ద దంపతుల హత్య కేసులో నిందితులకు బెయిల్‌ కోసం పెట్టిన ష్యూరిటీలు నకిలీవంటూ కార్యదర్శి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోపితులను ఆరెస్టు చేశారు. కాగా న్యాయవాది షేక్‌ లతీఫ్‌ ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉందని సీనియర్‌ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనపై ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాధితుడు, న్యాయవాది లతీఫ్‌తో పాటు పలువురు సీనియర్‌ న్యాయవాదులు మాట్లాడారు.
నేలకొండలపల్లిలో జరిగిన వృద్ద దంపతుల హత్య కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, రిలీజ్‌ ఆర్డర్‌ కోసం పెట్టుకొన్న ష్యూరిటీలు ఫోర్జరీ చేసినవంటూ వచ్చిన ఫిర్యాదులో మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో న్యాయవాది లతీఫ్‌ను ఆరవ నిందితుడిగా చేర్చారు. కాగా పోలీసులు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నేరుగా 8మంది పోలీసు సిబ్బందితో ఇంటిపై దాడి చేశారన్నారు. బెయిలబుల్‌ సెక్షన్‌లు ఉన్నప్పటికీ, ఎటువంటి నోటీస్‌ ఇవ్వకుండా, అక్రమంగా ఇంట్లో చొరబడి, ఇంట్లో వాళ్లను భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. తన కూతురు న్యాయవాది అని తెలిసి కూడా, ఆమె పై ఓ కానిస్టేబుల్‌ దౌర్జన్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో పెనుగులాడి మొబైల్‌ ఫోన్‌ బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించాడన్నారు. తనకు ఒక ఫోన్‌ కాల్‌ చేసి స్టేషన్‌కు రమ్మంటే వెళ్లి సమాధానం చెప్పే వాడినని, ఉద్ధేశ్యపూర్వకంగానే తనపై పోలీసులు అనైతిక దాడికి పాల్పడ్డారని న్యాయవాది లతీఫ్‌ ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత కూడా తనతో అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక న్యాయవాదిని అని కూడా చూడకుండా అభ్యంతరకరంగా ప్రవర్తించడమే కాకుండా, పరామర్శించడానికి వచ్చిన సీనియర్‌ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్నారు. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వదగిన సెక్షన్‌లు అయినప్పటికీ, ఉద్ధేశ్యపూర్వకంగా, కక్ష్య సాధింపు ధోరణిలో రిమాండ్‌కు తరలించాలని పన్నాగం పన్నారన్నారు. పోలీసుల వ్యవహార శైలిపై న్యాయమూర్తి సున్నితంగా మందలించి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారని తెలిపారు. ఇది త‌న ఒక్కడిపై దాడి కాదని, ఇది పూర్తి న్యాయవ్యవస్థపై దాడిగా న్యాయవాది లతీఫ్‌ అభిప్రాయపడ్డారు. న్యాయం కోసం వాదించే న్యాయవాదిపైనే ఒక ప్రొసీజర్‌ పాటించకుండా అక్రమ అరెస్టులకు పాల్పడితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చట్టవిరుద్దంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవలసిందిగా పోలీసు ఉన్నతాధికారులకు, ఉన్నత న్యాయాధికారులకు లేఖలు సమర్పించినట్టు న్యాయవాది లతీఫ్‌ తెలియజేశారు. ష్యూరిటీలకు న్యాయవాదులకు సంబంధం లేదన్న సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా గౌరవించని స్థాయికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల వైఖరిని నిరసిస్తూ..
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ విధులకు గైర్హాజ‌రై నిరసన వ్యక్తం చేశారు. లతీఫ్ అరెస్ట్ అనైతికమని, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించవలసిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, అందుకే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు విధులకు గైర్హాజరై నిరసన వ్యక్తం చేయడం జరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు, కార్యదర్శి గద్దల దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *