ధరణిని అడ్డుపెట్టుకుని లక్షల ఎకరాలు కొల్లగొట్టారు..

  • 22ఏ పేరుతో పదేళ్లు పేదల కడుపుకొట్టారు..
  • భూదోపిడి బయటపడుతుందనే అసెంబ్లీ నుంచి పారిపోయారు
  • భూభారతితో పారదర్శక రెవెన్యూ వ్యవస్థ..
  • వచ్చే ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత పాలకులు పేదల భూములను కొల్లగొట్టారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి పేరుతో జరిగిన భూదోపిడీ, అక్రమ లావాదేవీలపై అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాల్సి వస్తుందనే బీఆర్ఎస్‌ నాయకులు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. ‘‘తప్పుచేసినోడు తలవంచుకుంటాడు.. పాపం చేసినోడు పారిపోతాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. కుటుంబ ఆస్తులు, వాళ్ల ఖాందాన్‌ ఆస్తులు పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారని, తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని మంత్రి పొగులేటి ఆరోపించారు. ముఖ్యంగా భూముల విషయంలో తెలంగాణ ప్రజలను దారుణంగా దగా చేశారని మండిపడ్డారు.

ధరణిని అడ్డుపెట్టుకుని భూదోపిడీ

ధరణి పోర్టల్‌ను తీసుకురావడం వెనుక పేదల భూములను కొల్లగొట్టే పెద్ద స్కెచ్‌ ఉందని పొంగులేటి ఆరోపించారు. ‘‘నలుగురు వ్యక్తులు.. నాలుగు గోడల మధ్య ధరణిని తీసుకొచ్చారు’’ అని విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల విలువైన భూములను అక్రమంగా తమవాళ్ల పేర్ల మీదకు, తమ తొత్తుల పేర్ల మీదకు బదలాయించుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాలను గత పాలకులు తమ సొంత ఆస్తిలా భావించారని అన్నారు. ధరణి పోర్టల్‌ నిర్వహణను దివాళా తీసిన విదేశీ సంస్థకు అప్పగించారని, పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని అర్ధరాత్రి వేళ కూడా భూముల రిజిస్ట్రేషన్లు చేశారని విమర్శించారు. ధరణిలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా, తాము దోచుకున్న భూములు ఇతరులకు కనిపించకుండా ‘సీక్రెట్‌ లాక్‌’ వ్యవస్థను తీసుకొచ్చారని ఆరోపించారు.

ధరణిలో నిషేధిత భూముల జాబితా నుంచి రిలీవ్‌ చేసిన భూములు, ఇతర భూముల లావాదేవీలకు సంబంధించి సరైన రికార్డులు కూడా లేకుండా పోయాయని మంత్రి అన్నారు. ధరణి పోర్టల్‌లో ఒక్క రోజులోనే మ్యుటేషన్‌ చేసే విధానం పెట్టడం వల్ల అనేక అక్రమాలకు అవకాశం ఏర్పడిందని ఆరోపించారు. ధరణి చట్టం తీసుకొచ్చిన సమయంలో మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, తమ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయలేదని తెలిపారు.

22ఏ పేరుతో పేదల కడుపుకొట్టారు

గత పదేళ్లు అధికారంలో ఉండి 22ఏ పేరుతో పేదల భూములను చెరబట్టారని పొంగులేటి ఆరోపించారు. ‘‘పదేళ్లు ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారు. పింక్‌ కలర్‌ షర్టు వేసుకున్న వాళ్లకే బెనిఫిట్‌ అయ్యింది’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖకు మంత్రి ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మొత్తం వ్యవహారాలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనుసైగల్లోనే నడిపించారని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖను కూడా కేసీఆర్‌ తన వద్దే ఉంచుకున్నారని పేర్కొన్నారు. భూముల వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకుని పేదల ఆస్తులకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు.

ధరణిలోని లోపాలు, అక్రమాల కారణంగా లక్షలాది మంది రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని, ఎందరో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు. ధరణి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్‌ పాలనలో రెవెన్యూ శాఖలో జరిగిన విధ్వంసం చిన్నది కాదని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన వ్యవస్థనే ప్రజలకు సమస్యగా మార్చారని మండిపడ్డారు.

దొరల ఇలాకాల్లోనూ ధరణి బాధిత రైతులు

ధరణి సమస్యలు గత పాలకుల సొంత నియోజకవర్గాల్లోనూ ఉన్నాయని పొంగులేటి అన్నారు. హరీశ్‌రావు నియోజకవర్గంలోని మిరుదొడ్డిలో కృష్ణయ్య అనే రైతు ధరణి సమస్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. తాను కష్టపడి కొనుగోలు చేసిన భూమికి పట్టా కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, చివరకు తన భూమి తనకు దక్కకపోవడంతో కృష్ణయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. దొరల సొంత ఇలాఖాల్లోనూ ధరణి ఆత్మహత్యలు జరిగాయి అంటూ గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

అలాగే కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనూ ధరణి సమస్యలు భారీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగు మండలంలో ధరణిపై నిర్వహించిన సదస్సులో మొత్తం 272 భూ సమస్యల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 175కుపైగా ధరణికి సంబంధించినవేనని చెప్పారు. దరఖాస్తులు తీసుకున్నారు కానీ ధరణిలో జరిగిన తప్పులను సరిదిద్ది భూ సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు. గత పాలకుల సొంత ఇలాకాల్లోనే ఇన్ని సమస్యలు ఉంటే.. రాష్ట్రంలోని సాధారణ రైతుల పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చన్నారు.

వీఆర్ఏ, వీఆర్‌ఓ వ్యవస్థల రద్దుపైనా విమర్శలు

గత ప్రభుత్వం గ్రామస్థాయిలో కీలకంగా పనిచేసే వీఆర్ఏ, వీఆర్‌ఓ వ్యవస్థలను రద్దు చేసి గ్రామాల్లో రెవెన్యూ పాలనను అస్తవ్యస్తం చేసిందని పొంగులేటి విమర్శించారు. ధరణిలో భూ సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేందుకు అవసరమైన స్థానిక వ్యవస్థ కూడా లేకుండా చేశారని అన్నారు. గ్రామస్థాయిలో భూ రికార్డులు, ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకునే వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ కల్పించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానమని, పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి రెవెన్యూ సంస్కరణను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

భూమి లేకుండానే పాస్‌బుక్‌లు, రైతుబంధు

ధరణి వ్యవస్థలో భూమి లేకుండానే పాస్‌బుక్‌లు జారీ చేసిన ఘటనలు ఉన్నాయని పొంగులేటి ఆరోపించారు. ‘‘దొరల పాలనలో పాస్‌బుక్‌లు ఉండేవి.. భూములు మాత్రం ఉండేవి కాదు’’ అని వ్యాఖ్యానించారు. ధరణి చట్టం తీసుకొచ్చి తమ బంధువులు, రాజకీయ అనుచరులకు పాస్‌బుక్‌లు ఇచ్చారని, భూమి లేకుండానే ఆ పాస్‌బుక్‌ల ఆధారంగా రైతుబంధు కూడా ఇచ్చారని ఆరోపించారు. భూమి లేని వారికి రైతుబంధు ఇచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని విమర్శించారు.

ఒక్క నల్గొండ జిల్లాలోనే 14 వేల ఎకరాల్లో సర్వే నిర్వహిస్తే.. సుమారు 4 వేల ఎకరాలకు దొంగ పట్టాలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. భూముల రికార్డుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు సమగ్ర భూసర్వే చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దాదాపు 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.

మాక్‌ అసెంబ్లీ పెట్టుకుని డ్రామాలు…

ధరణి, 22ఏ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్‌ సభ్యులు సభకు దూరంగా ఉండటాన్ని పొంగులేటి తప్పుబట్టారు. ‘‘అసలు అసెంబ్లీ ఇక్కడ నిర్వహిస్తుంటే.. మాక్‌ అసెంబ్లీ ఎందుకు? అసెంబ్లీకి రాకుండా మాక్‌ అసెంబ్లీ పెట్టుకుని అక్కడ డ్రామాలు ఆడుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుంటే ఇక్కడే ఉండేవారు కదా’’ అని ప్రశ్నించారు. ధరణి ద్వారా జరిగిన వ్యవహారాలపై అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే పారిపోయారని ఆరోపించారు. ‘‘తప్పుచేసినోడు తలవంచుకుంటాడు.. పాపం చేసినోడు పారిపోతాడు’’ అంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

భూభారతితో పక్కా రికార్డులు

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ భూభారతి.. ద్వారా దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచే రెవెన్యూ వ్యవస్థను తెలంగాణకు అందిస్తున్నామని పొంగులేటి తెలిపారు. భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి భూ లావాదేవీకి పారదర్శకంగా పక్కా రికార్డులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ధరణిలో 80 మాడ్యూల్స్‌ పెట్టి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు భూభారతి చట్టంలో వాటిని కేవలం ఐదు మాడ్యూల్స్‌కు పరిమితం చేశామని వివరించారు. ప్రజలకు అర్థమయ్యేలా, సులభంగా భూ సమస్యలు పరిష్కరించే విధంగా కొత్త వ్యవస్థను రూపొందించామని తెలిపారు.

ధరణి ఉన్న సమయంలో సుమారు 2.49 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండేవని, భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత మరో మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం ఐదు లక్షలకుపైగా దరఖాస్తులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఏదైనా దరఖాస్తును పరిష్కరించలేని పరిస్థితి ఉంటే.. ఏ కారణంతో పరిష్కరించలేకపోయామో కూడా స్పష్టంగా చెబుతామని అన్నారు. భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే.. అందరికీ పట్టాలు

రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టామని చెప్పారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో భూముల సర్వే పూర్తి చేసి రైతులకు పాస్‌బుక్‌లు అందజేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే పూర్తి చేసి రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 387 గ్రామాలకు నకళ్లు కూడా లేవని, అలాంటి ప్రాంతాల్లో భూముల హక్కులను పక్కాగా నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత భూములపై హక్కులు, లావాదేవీలకు స్పష్టమైన రికార్డులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యం

పోరాడి సాధించుకున్న తెలంగాణను గత పాలకులు స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని పొంగులేటి ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్‌ కుటుంబం, వారి బంధువుల ఆస్తులు పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని, తెలంగాణ ప్రజల ఆస్తుల పరిరక్షణను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో పేదల భూములకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ధరణిలో జరిగిన తప్పులు, అక్రమ లావాదేవీలు, భూ రికార్డుల్లోని లోపాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ.. పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూమిపై హక్కు, భద్రత కల్పించడమే భూభారతి లక్ష్యమని చెప్పారు.

భూముల విషయంలో గత పాలనలో జరిగిన అక్రమాలు, ధరణి ద్వారా ఏర్పడిన సమస్యలన్నీ బయటకు తీస్తామని మంత్రి స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడటమే మా బాధ్యత. పేదల భూములు, రైతుల భూములు ఇకపై ఎవరి గుప్పిట్లో ఉండవు’’ అని అన్నారు. భూభారతి ద్వారా ప్రతి భూ లావాదేవీకి పక్కా రికార్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, సమగ్ర భూసర్వే పూర్తయిన తర్వాత భూ హక్కులకు మరింత భద్రత కల్పిస్తామని పొంగులేటి తెలిపారు.