palamooru| డీపీఆర్‌ను మూడోసారి వెనక్కి పంపారు: శ్రీనివాస్‌గౌడ్‌

డీపీఆర్‌ను మూడోసారి వెనక్కి పంపారు: శ్రీనివాస్‌గౌడ్‌

  • 90 టీఎంసీలపై స్పష్టత లేదనడం కుంటి సాకులే
  • వారం రోజుల్లో నార్లాపూర్‌ పంపులు ఆన్‌ చేయాలి
  • లేకుంటే రైతులతో కలిసి అక్కడే కూర్చుంటాం
  • పాలమూరు ప్రజల బతుకులతో చెలగాటమాడొద్దు: మాజీ మంత్రి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్రం మూడోసారి వెనక్కి పంపడంపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 90 టీఎంసీల నీటి కేటాయింపుపై స్పష్టత లేదని చెప్పడం కుంటి సాకులేనని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, సాగునీటి సమస్యలు, నార్లాపూర్‌ పంపుల నిర్వహణ, జూరాల రైతులపై కేసుల అంశాలను ప్రస్తావించారు.

‘మూడుసార్లు డీపీఆర్‌ వెనక్కి’
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రధానమైన అడ్డంకులు 2023 ఆగస్టు 10 నాటికే తొలగిపోయాయని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అప్పట్లో చిన్న సంతకం పెండింగ్‌లో పడిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, కేంద్రంలో చంద్రబాబు మద్దతుతో ప్రభుత్వం ఏర్పడటంతో ఆ సంతకం ఆగిపోయిందని ఆరోపించారు. “పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను మూడుసార్లు వెనక్కి పంపడం పాలమూరుకు అవమానం. 12.5 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టుకు ఇలాంటి దుస్థితి ఎందుకు?” అని ప్రశ్నించారు.

‘90 టీఎంసీలపై స్పష్టత ఉంది’
90 టీఎంసీల నీటి కేటాయింపుపై తమకు పూర్తి స్పష్టత ఉందని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. 1980లో బచావత్‌ ట్రైబ్యునల్‌ 45 టీఎంసీల నీటి కేటాయింపుపై స్పష్టంగా పేర్కొందని తెలిపారు. నాగార్జునసాగర్‌ ఎగువన 45 టీఎంసీలను వినియోగించుకునే హక్కు తెలంగాణకు ఉందని ఆయన పేర్కొన్నారు. నిజాం హయాం తర్వాత ధ్వంసమైన చెరువుల కారణంగా మైనర్‌ ఇరిగేషన్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు మరో 45 టీఎంసీలను కేటాయించారని చెప్పారు. ఈ రెండు కలిపి 90 టీఎంసీలు అవుతాయని, లెక్కల్లో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.

‘జాతీయ హోదా ఏమైంది?’
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి ప్రధాని నరేంద్ర మోదీ 2014లోనే మాట్లాడారని శ్రీనివాస్‌గౌడ్‌ గుర్తు చేశారు. “జాతీయ హోదా ఇవ్వకపోయినా రాష్ట్రం సొంత నిధులతో ప్రాజెక్టు నిర్మించుకుంటే కనీసం అనుమతులు కూడా ఇవ్వరా? నిధులు ఇవ్వకపోయినా అనుమతులు ఇవ్వకూడదా?” అని ప్రశ్నించారు. “తెలంగాణ దేశంలో లేదా? ఇక్కడి ప్రజలు పన్నులు కట్టడం లేదా?” అని నిలదీశారు.

‘బనకచర్ల గురించే ఇదంతా’
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాల వెనుక బనకచర్ల అంశం ఉందని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. బనకచర్లకు అనుమతులు ఇస్తేనే పాలమూరుకు అనుమతులు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర జల సంఘం చైర్మన్‌ బనకచర్లకు అంగీకరిస్తే పాలమూరుకు అనుమతి ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి ప్రభావం ఉందని, సాగునీటి శాఖ ఆంధ్రా గుప్పిట్లో ఉందని వ్యాఖ్యానించారు.

‘కృష్ణా ఒడ్డున ఉన్న పాలమూరుకు నీళ్లు ఇవ్వరా?’
కృష్ణా బేసిన్‌ నుంచి పెన్నాకు నీటిని తరలిస్తున్నారని, కృష్ణా నది ఒడ్డున ఉన్న పాలమూరుకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. కల్వకుర్తి పంపులను కూడా పూర్తిస్థాయిలో ఆన్‌ చేయడం లేదని అన్నారు. “కేసీఆర్‌ ప్రభుత్వం ఉంటే ఇలా జరిగేదా? పాలమూరు పంపులు ఆన్‌ చేసిన తర్వాతే వెలిగొండ పంపులు ఆన్‌ చేయడానికి కేసీఆర్‌ ఒప్పుకునేవారు” అని పేర్కొన్నారు.

‘వారం రోజుల్లో పంపులు ఆన్‌ చేయాలి’
పాలమూరు రైతుల సాగునీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. నార్లాపూర్‌ నుంచి కరివెన వరకు అన్ని రిజర్వాయర్లను వెంటనే నింపాలని కోరారు. “వారం రోజుల్లో నార్లాపూర్‌ పంపులు ఆన్‌ చేయకపోతే రైతులతో కలిసి అక్కడే కూర్చుంటాం” అని హెచ్చరించారు. కర్ణాటక నుంచి ఇస్తామన్న నీటి పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. పాలమూరులో ఎండిపోయిన పంటలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం హెలికాప్టర్‌లోనైనా పరిశీలించాలని అన్నారు.

‘ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత’
పాలమూరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. “ఒక్క ఎకరం పంట ఎండిపోయినా అది ప్రభుత్వానిదే బాధ్యత” అని స్పష్టం చేశారు. పాలమూరు రైతులు తిరగబడితే ప్రభుత్వం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. “చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకోలేదా? పాలమూరు కష్టాలు ఆయనకు పట్టవా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దు” అని కోరారు.

‘రైతులపై కేసులు ఎందుకు?’
జూరాల నీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టడాన్ని శ్రీనివాస్‌గౌడ్‌ తప్పుబట్టారు. రైతులు కడుపుమండి ఆందోళనలు చేస్తే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. “కేసులు పెట్టడం తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏదీ చేతకావడం లేదు. పోలీసులే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు” అని విమర్శించారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే జూరాల రైతులపై పెట్టిన కేసులను ఒక్క జీవోతో ఎత్తివేస్తామని అన్నారు.

‘జూపల్లి మాట మార్చారు’
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి జూపల్లి కృష్ణారావు వైఖరిని కూడా శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఉన్నప్పుడు “పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో తన జీవితం ధన్యమైంది” అని జూపల్లి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. “కాంగ్రెస్‌లో చేరి మంత్రి కాగానే పాలమూరు ప్రాజెక్టు జూపల్లికి చెడ్డదైందా?” అని ప్రశ్నించారు. చివరగా పాలమూరు ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, పాలమూరుకు ద్రోహం చేస్తున్నారని తాము భావిస్తున్న వారిని ప్రజలు ప్రశ్నిస్తారని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.