పట్టణ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితులు ఇవే!

  • మేయర్‌ అభ్యర్థికి రూ.25 లక్షలు..
  • వార్డు సభ్యులకు రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిమితి
  • ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక నిఘా..
  • నిరంతరం తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశం

గుంటూరు, ఆంధ్రప్రభ: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన వ్యయ పరిమితులను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. అభ్యర్థులు తమకు నిర్దేశించిన పరిమితులకు లోబడి మాత్రమే ఎన్నికల ఖర్చులు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత నోడల్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

అభ్యర్థుల వారీగా వ్యయ పరిమితులు

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితుల వివరాలను కలెక్టర్‌ వెల్లడించారు.

  • మేయర్‌ అభ్యర్థి: రూ.25 లక్షలు
  • నగరపాలక సంస్థ వార్డు సభ్యుడు: రూ.10 లక్షలు
  • పురపాలక సంఘం అధ్యక్షుడు: రూ.20 లక్షలు
  • పురపాలక సంఘం వార్డు సభ్యుడు: రూ.7.50 లక్షలు

అభ్యర్థులు ఈ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ సూచించారు.

నియమావళి ఉల్లంఘనలను ఉపేక్షించొద్దు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఏ అంశాన్నీ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. వ్యయ పర్యవేక్షణ కమిటీలు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సంబంధిత నోడల్‌ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె. శ్రీనివాసరావు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి. జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగసాయికుమార్‌, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, డేవిడ్‌, వెంకటేశ్‌, ఎస్‌.జి.ఎస్‌.డబ్ల్యు సమన్వయ అధికారి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.