దానాన్ని మించిన ధర్మం లేదు

దానం చేయడం వలన మనలో ఆధ్యాత్మిక దృష్టి అలవడుతుంది. అహంకార, మమకారాలనే దుర్గుణాలు నశిస్తాయి. ఇవ్వడం గొప్ప గుణమే కానీ అది అహంకారంతో కాకుండా ప్రేమతో చేయాలి. తనను పోలిన మహాదాత మరొకరుండరనీ, తాను చేసిన దానాన్ని మించిన దానం మరొకటి ఉండదనీ మిడిసి పడరాదు. ”ఆదర మలరంగా ఇడుట లెస్స”. వినయంగా, గౌరవంతో దానమివ్వాలన్నది మహాభారతం.
”దానం దేయేషు ముక్త హస్తతా”.. చేసే దానాన్ని చేతులు జోడించి, సవినయంగా చేయాలని తమ ”గీతా భాష్యం”లో శ్రీ ఆదిశంకరాచార్యులు అన్నారు. ”శ్రద్ధయా దేయం, అశ్రద్ధాయా అదే యం, శ్రియా దేయం, హయాదేయం, ధియాదేయం, సంవిధా దేయం” అంటూ తైత్తరీయోపనిషత్తు దానాన్ని శ్రద్ధతో, ఆనందంగా, బుద్ధి పూర్వకంగా, వినయంగా చేయాలని సూచించింది.
నిజానికి మనలను మనం ఉద్ధరించుకోడానికే తప్ప పుచ్చుకొనే వానిని ఉద్ధరించడానికి దానం ఇవ్వడంలేదనే సత్యాన్ని గ్రహించాలి. ”ఒకడు ఇతరులకిచ్చునది సర్వమూ తనకే ఇచ్చుకొ నుచున్నాడు” అన్నారు భగవాన్‌ శ్రీ రమణ మహర్షి. అర్హులకు చేసే దానం ఇప్పుడూ, భవిష్యత్తులోనూ ఈ జన్మలోనూ, తర్వాతి జన్మలలోనూ ఈ లోకంలోనూ, పరలోకంలోనూ తనకూ, తనవారికీ కూడా సుఖాలను ప్రసాదిస్తుంది. ఇక్కడ కూడబెట్టుకొన్న దేనినీ వ్యక్తి తనవెంట తీసుకపోవడం సాధ్యం కాదు కానీ, దాన ఫలం మాత్రం తనకంటే ముందే ఇతర లోకాలకూ, ఇతర జన్మలకూ వెళ్ళి తనకు, తనవారికి ఉపయోగపడుతుంది.
”పాత్రేత్వేక మిహోత్సజ్య పరత్రానంత మాప్యతే”. ఇక్కడ ఒక్కటి దానము చేస్తే అనంతరం అక్కడ అనంతంగా లభిస్తుందన్న మాట. ”పది కలిగిన ఒకటీవలె, పది పదులు గడించెనేని పది ఇవ్వదగున్‌” అంటూ శ్రీనాథ మహాకవి తనకు ఉన్న దానిలో కనీసం పదవ వంతు దానానికి ఉపయోగించాలని తన ‘శృంగార నైషధం’ కావ్యంలో పేర్కొన్నారు. దానగుణంలేనివాడు భూమికి బరువనీ, దానధర్మాలు చేయకపోతే కష్టనష్టాలు కల్గుతాయనీ శాస్త్రాలు హెచ్చరించాయి. ”అదాన దోషేణ భవేత్‌ దరిద్ర:, దరిద్ర దోషేణ కరోతి పాపం / పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర: పునరేవపాపీ”. గత జన్మలో దానధర్మాలు చేయకపోవడంవల్ల ఈ జన్మలో దారిద్య్రం కలిగింది. ఆ దరిద్రం మనతో అనేక పాపకృత్యాలు చేయిస్తుంది. పాప కర్మాచరణం వల్ల నరకప్రాప్తి, తిరిగి దరిద్రునిగానే జన్మించడం, మళ్ళీ పాపాలు చేయడం అనే ఈ కష్టాల వలయం నుండీ తప్పించుకోవాలంటే శక్త్యనుసారం ఈ జన్మలోనే దాన ధర్మాలు చేయాలి.
దానం చేసే వస్తువు న్యాయంగా, ధర్మబద్ధంగా సంపాదించినదై ఉండాలి. ”అన్యాయార్జితమైన విత్తమున చేయంబూను దానంబది మూర్ఖన్యాయంబగు, దాననేమియు ఫలంబు లేదు” అని మహాభారతం చెప్పింది. అంతేకాదు. ”సత్యరతులు, దాంతులు, ధీరులు, నిజకర్మ నిరతులు, విజితేంద్రియులు, సర్వ భూతహతులు, అలుబ్ధులు, శుచులు” అయినవారే దానం పుచ్చుకోడానికి అర్హులని మహాభారతం నిర్ణయించింది.
అన్ని మతాలలోనూ, అన్ని సంస్కృతులలోనూ దానం చేయడానికి విశిష్టమైన స్థానం ఉంది. హిందూ సంస్కృతిలో దశ దానాలివ్వడం గురించి చెప్పబడింది. ”గో, భూ, తిల, హిరణ్యా, ఆజ్య, వాసౌ, ధాన్య, గుడాని/ రౌప్యం, లవణ, మిత్యాహ: దశదానం ప్ర కీర్తితా:”. దూడతో కూడిన ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు, అనేవి దశ దానాలు. వీటిని సమంత్రకంగా దానం చేయాలి. వీటిలో మొదటిది గోదానం. పదునాలుగు లోకాలనూ తనలో కలిగి ఉన్న ఆవును దానం ఇవ్వడం వల్ల స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. బాగా పాలను ఇచ్చేది, మంచి వయసులో ఉన్నది, దూడతో కూడు కొన్నది అయిన ఆవును, బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, క్రొత్త వస్త్రాలతో అలంకరించినదానితోబాటు పాలు పితుకోవడానికి పాత్రను, ఫల, దక్షిణ, తాంబూలాలతోబాటు, ఆ ఆవును చక్కగా సంరక్షించుకోగలిగిన వాడైన ఒక పేద విప్రునికి యథావిధిగా దానం ఇవ్వాలి. ఆవు సంరక్షణ కోసం ఆరు నెలలకు సరిపడే గ్రాసాన్ని కూడా ఇవ్వాలి.
భూదేవిని పెండ్లి చేసుకొన్న శ్రీమహా విష్ణువు, లోకేశ్వరుడైన పరమేశ్వరుడు ఇరువురూ భూదానం చేసిన వారిపట్ల సంప్రీతులై, దాతకు శాశ్వత శివలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు. సారవంతమైన భూమిని వ్యవసాయానికి గానీ, గృహ నిర్మాణానికి గానీ అనువైన దానిని మాత్రమే దానం చేయాలంటాయి శాస్త్రాలు. నువ్వులు ఆయుర్వృద్ధికరాలు. ఇవి శ్రీమన్నారాయణుని శరీరం నుండి ఉద్భవించాయని పురాణ వచనం. నువ్వులను దానం ఇవ్వడం వలన విష్ణులోక ప్రాప్తి, పూర్ణాయురారోగ్యాలు దాతకు ప్రాప్తిస్తాయి.
హిరణ్య గర్భుడని బ్రహ్మదేవునికి పేరు. బ్రహ్మ ఉదరం నుండి బంగారం ఉద్భవించిందట. సువర్ణ దానంతో దాత సర్వ పాప కర్మల నుండీ విముక్తుడై అగ్నిలోకాన్ని పొందుతాడు. ఆవు నెయ్యిని ఆజ్యం అంటారు. ఇది కామధేనువు యొక్క పాలనుండి లభిస్తుంది. యజ్ఞయాగాది క్రతువులలో ఇది ‘హవిస్సు’ రూపంలో ఆహారంగా అర్పించబడుతుంది. ఆజ్య దానం వల్ల సమస్త యజ్ఞఫలం లభిస్తుంది. ఆజ్య దాతలకు మహేంద్రుడు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రమిస్తాడు. మాన సంరక్షణకు, శీతోష్ణముల బాధ నుండి రక్షణకు ఉపయోగపడే వస్త్రాలను దానంచేస్తే సకల శుభ సంప్రాప్తి ఫలంగా లభిస్తుంది.
ప్రాణుల క్షుద్బాధను తొలగించేదీ, ప్రత్యుత్పత్తి శక్తిని కలిగించేది అయిన ధాన్య దానం వలన దాతకు ఇ#హపర సౌఖ్యాలు లభిస్తాయి. దిక్పాలక లోకప్రాప్తి కలుగుతుంది. షడ్రుచులలో మధురమైన రుచి కలిగిన బెల్లాన్ని దానం చేయడం వలన మహాలక్ష్మి, గణపతులు సంతోషించి అఖండ విజయాలను, అనంత సంపదలను దాతకు ప్రసాదిస్తారు.
అగ్ని దేవుని నేత్రాలనుండి పుట్టిన వెండిని దానం చేస్తే పితృదేవతలు, హరిహరులు సంప్రీతులై సర్వ సంపదలను, వంశాభివృద్ధిని దాతకు అనుగ్రమిస్తారు. ఏది లేకపోతే వంటకు రుచి లభించదో ఆ ఉప్పు దానం చేయడం మృత్యుదేవతకు ప్రీతికరం. తుష్టి, పుష్టి, పూర్ణాయువు ఉప్పును దానం చేయడంవల్ల లభిస్తుంది. ఈ దశ దానాలకు విద్య, కన్య, గృహ, శయ్యా, దాసీ, అగ్రహారాలనే ఆరు దానాలను కూడా జత చేర్చి ‘షోడశ’ దానాలుగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇవి కాక, అన్న దానం, వేసవిలో జలదానం, రోగ భీతులకు ఆరోగ్య ప్రదానం, ఆపదలో ఉన్నవారికి అవయవ దానం మిక్కిలి శ్రేష్ఠమైనవిగా చెప్పవచ్చు.
ఇస్లాం సంస్కృతిలో కూడా ఫిత్ర (తమ సంపాదనలో కొంత భాగం), జకాత్‌ (తమ ఆస్తిలో భాగం) అనే దానాలు ప్రసిద్ధమైనవి. వీటిని రోజూ చేయలేనివారు కనీసం పవిత్ర రంజాన్‌ మాసంలోనైనా చేయాలని ఆ సంస్కృతి బోధిస్తుంది. అలాగే, క్రైస్తవంలో కూడా పేదలకు ఆహార, ధన సాయం, వివిధ రూపాలలో అవసరమైనవి దానం చేయాలనే నిబంధన ఉంది.ఇహపరదాయకమైన దాన గుణమే హస్త భూషణం. ”హస్తస్య భూషణం దానం” అంటుంది నీతి శాస్త్రం. ”శతహస్త సమాహర, సహస్ర హస్త వికిర”. అంటే వంద చేతులతో సంపాదించు. వేయి చేతులతో దానమివ్వు. ఇది మన దేశ నీతి.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *