- ఆ అవకతవకలన్నీగత అయిదేళ్లలోనివే
- బోర్డు ద్వారా తప్పుడు ప్రచారాలపై చర్యలు
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : టీటీడీ గోశాల విషయంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి శ్యామలరావు అన్నారు. పైగా గత అయిదేళ్ల మధ్యకాలంలో గోశాల నిర్వహణలో ఎన్నో అవకతవకలు జరిగాయని అప్పటి విజిలెన్సు నివేదికలే బయట పెట్టాయి.. వాస్తవానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గత పది నెలల్లో గోశాలతో పాటు అన్ని చోట్లా ప్రక్షాళనలు జరుగుతున్నాయి. ఇక కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై త్వరలో జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు తెలిపారు. టీటీడీకి చెందిన గోశాల నిర్వహణపై గత రెండు మూడు రోజులుగా రాజకీయ పరమైన విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయన స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… టీటీడీ గోశాల నిర్వహణపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ వక్రీకరణలేనని తేలిందని స్పష్టం చేశారు. మరోవైపు అత్యధికశాతం టీటీడీ గోశాల నిర్వహణపై 2021 – 2024 మధ్యకాలంలో అప్పటి టీటీడీ విజిలెన్స్ విచారణలో బయటపడ్డ అవకతవకలు వెలుగు చూశాయన్నారు. అందులో గోవుల మరణాల గురించి బయట పడకుండా చూడడం, గోవులకు పురుగులు పట్టిన నాసిరకం దాణా సరఫరా, పశు వైద్యానికి సంబంధించిన మందుల్లో కాలం చెల్లిన మందుల వినియోగం, లేని ఆవుల పేరుతో కాంట్రాక్టుల మాటున నిధుల దుర్వినియోగం వంటి ఎన్నో అవకతవకలు ఉన్నాయన్నారు.
ఈసందర్భంగా శ్యామలరావు సంబంధిత విజిలెన్స్ నివేదికల వివరాలను, పట్టించుకోకపోవడంతో అనారోగ్యంతో మరణించిన గోవుల, సరఫరా చేసిన దాణాలో పురుగులు ఉండడాన్ని, మందుల నాణ్యత లోపాలను తెలిపే చిత్రాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మీడియాకు చూపించారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి డెయిరీకి రూ.5 కోట్లు చెల్లించి 14 లక్షల లీటర్ల నాణ్యత లేని పాలను కొనుగోలు చేసినట్టు కూడా 2024 మార్చిలో విజిలెన్స్ విభాగం సమర్పించిన విచారణ నివేదిక బయట పెట్టిందన్నారు. ఇక గోవులు చనిపోవడం గురించి వివరణ ఇస్తూ ఎక్కువగా గోవులను కాపాడే పవిత్ర లక్ష్యంతో వయసుడిగిన గోవులను సైతం టీటీడీ దాతల ద్వారా స్వీకరిస్తుందని, ఆ సమర్పించిన గోవుల్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు, వృద్దాప్య సమస్యల కారణంగా మరణాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయన్నారు. 2024 సంవత్సరంలో 179 గోవులు మరణించగా, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు మరణించాయని చెబుతూ సగటున ప్రతి నెలా 15గోవులు మరణిస్తుంటాయని రికార్డులు చెబుతున్నాయన్నారు. ఆ అంశాన్ని పట్టుకుని టీటీడీ గోశాలలో గత మూడునెలల్లో వంద గోవులు చనిపోయాయని చెప్పడం, ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలను చూపించి ఆరోపించడం నిజాల వక్రీకరణే అన్నారు.
అన్నింటినీ మించి చనిపోయే ప్రతి గోవు వివరాలను రికార్డు చేసి ఉంటారని, ఆరోపిస్తున్నట్టు చనిపోయిన గోవుల వివరాలు గోప్యంగా దాచి ఉంచారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. గత మూడునెలల్లో 43గోవులు మరణిస్తే 59గోవుల జననాలు జరిగాయని తెలిపారు. అనారోగ్యంతో మరణించే గోవులను తప్ప ఇతర గోవులన్నింటికీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను దాచి ఉంచుతున్నామని చెప్పారు. పోషకాహారం అందించడంతో పాటు మంచి మందులను సరఫరా చేసే ఏర్పాట్లు చేశామన్నారు. పాల ఉత్పత్తి తగ్గిందనే ప్రచారాన్ని కూడా ఆయన ఖండిస్తూ ఇంతకుముందు 450 నుంచి 550 లీటర్లు ఉండే పాల దిగుబడి ప్రస్తుతం 762 లీటర్లకు పెరిగిందన్నారు. 2022 నుంచి గోశాల లో ఉండాల్సిన పశు వైద్యుల సంఖ్య 9 మంది కాగా, 5 మంది మాత్రమే పని చేస్తున్నారని, ఇతర సిబ్బంది 349 మంది కావాల్సివుండగా 135 మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. మూడునెలల క్రితం గోశాలకు ఇన్ ఛార్జ్ ని నియమించాక క్రమంగా అంచలంచెలుగా గోశాల ను అభివృద్ధి జరుగుతోందని అంటూ సిబ్బంది నియమాకాల విషయంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాస్తవాలను వక్రీకరించి కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీటీడీ మాజీ చైర్మన్ చేసిన ఆరోపణలపై వచ్చే బోర్డు సమావేశం ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకోనున్నామని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ మీడియా సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, గోశాల ఇన్ ఛార్జ్, టీటీడీ అటవీ శాఖాధికారి శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.