మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు..

మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు..
- జిల్లాలో 3,84373 కనెక్షన్లు
- 16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా
- వంట గ్యాస్ సమస్యల పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- సమాచారం కోసం 9391942254 సంప్రదించాలి
- హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వ చేసిన 44 సిలిండర్ల సీజ్
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
- సోషల్ మీడియాలో గ్యాస్ లేదని వదంతులు సృష్టిస్తే కేసులు చేస్తాం
- ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దు
- జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లాల్లో గృహా అవసరాలకు ఎల్పిజి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డివి శ్రీనివాస రావు పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 3,84373 కనెక్షన్లు ఉన్నాయని,16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేశామని వెల్లడించారు.
ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దని సూచించారు. జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా సాధారణంగా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో, హాస్టల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్ లో, పాఠశాలల్లో, అత్యవసర సేవలలో గ్యాస్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని హెచ్చరించారు. తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.
అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సమస్యలు ఉంటే 9391942254 నెంబర్ ను సంప్రదించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని గ్యాస్ వినియోగదారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితులు, అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, పారదర్శకంగా సేవలు అందించడం ప్రతి గ్యాస్ ఏజెన్సీ యొక్క బాధ్యతగా గుర్తుచేశారు.
ప్రజలు గ్యాస్ కొరత పై వస్తున్న అపోహలను నమ్మకూడదని, జిల్లాలో గ్యాస్ నిల్వలు, సరఫరా పూర్తిగా సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు, ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో సంబంధిత అధికారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చని వెల్లడించారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గ్యాస్ కొరత ఉందని వదంతులు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినియోగదారులు గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి లింక్ లు వచ్చిన ఓపెన్ చేయకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ సైబర్ క్రైమ్ కు గురి కావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డిపిఆర్ఓ రామచంద్ర రాజు, ఏపీఆర్ఓ బాబురావు పాల్గొన్నారు.
