Chiru-Nag multi-starrer film: చిరు-నాగ్ మల్టీస్టారర్‌కు అంతా సిద్ధం..?
రంగంలోకి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి!
Chiru-Nag multi-starrer film: టాలీవుడ్లో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోందా? సినీ ప్రియులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలయికలో మల్టీస్టారర్ చిత్రం కార్యరూపం దాల్చనుందా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ అరుదైన ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సక్సెస్ బాటలో హిట్ మెషీన్..
మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం జోరు మీదున్నారు. ఇప్పటికే వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆ సినిమాను నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ‘భగవంత్ కేసరి’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నలుగురు అగ్ర కథానాయకులతో అనిల్ రావిపూడి కల నెరవేరేనా..?
టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు తెరకెక్కించడమే తన ప్రధాన లక్ష్యమని అనిల్ రావిపూడి గతంలో పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇప్పటికే చిరు, బాలయ్య, వెంకీలతో బ్లాక్బస్టర్లు ఖాతాలో వేసుకున్న ఆయన, ఇప్పుడు నాగార్జునతో కూడా సినిమా చేస్తే ఆ అరుదైన ఘనతను సాధించిన ఏకైక దర్శకుడిగా నిలుస్తారు. ఈ క్రమంలోనే చిరంజీవి, నాగార్జునలను ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు అనిల్ ఒక పవర్ ఫుల్ మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మెగా – అక్కినేని ఆత్మీయ బంధం..
చిరంజీవి, నాగార్జునల మధ్య ఉన్న వ్యక్తిగత ఆత్మీయత, మైత్రి గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే అఖిల్ ‘లెనిన్’ చిత్ర విజయం సందర్భంగా చిరంజీవి అందించిన అభినందనలు, దానికి అఖిల్ “థాంక్యూ పెదనాన్నా” అంటూ తెలిపిన కృతజ్ఞతలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కుటుంబాల మధ్య ఉన్న ఈ అప్యాయత, ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే మల్టీస్టారర్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా మిక్స్ చేయడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి, ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కలయికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు భావిస్తున్నాయి
