‘మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారా?’
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ వద్ద జరిగిన నిరసనకు సంబంధించి కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్లిన నర్సారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలను ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. వారంతా దళితులా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘సంధ్యారావు’ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ గురించి ప్రస్తావించడంపైనా తలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు ముఖ్యమంత్రివా రేవంత్‌రెడ్డి? శాసనసభలో మాట్లాడేందుకు మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతావా?’’ అంటూ ప్రశ్నించారు. ‘సంధ్యారావు’ పేరుతో మహిళ పేరు ఉండగా, మగ గొంతు ఉందంటూ అసెంబ్లీలో మాట్లాడటం సరైన పద్ధతి కాదని తలసాని విమర్శించారు. మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఇటీవల అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి.
