Nandyala | టీడీపీలో బగ్గుమన్న విభేదాలు..

ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్న టీడీపీ నాయకులు


నంద్యాల బ్యూరో, జులై 4 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా (Nandyal District) లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని ఆత్మకూరు (Atmakur) పట్టణంలో టీడీపీ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బహిర్గతం కావడం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్లి ఈ ఏడాదిలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించాలని ఆదేశించారు.

ఈ మేరకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి (Byreddy Sabari), మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి (Erasu Prathap Reddy) లు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి సమాచారం అందించకుండా ఎలా పర్యటిస్తారు అంటూ స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి యత్నించారు.

ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి సుపరిపాలనలో ఒక అడుగు ముందుకు అనే కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని వార్డులో నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి (MLA Budda Rajasekhar Reddy)కి, స్థానిక టీడీపీ నాయకులకు సమాచారం ఇవ్వకుండానే ప్రచారం నిర్వహిస్తున్నారని బుడ్డా అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహంతో మాజీ మంత్రి ఏరాసు ఇంటిపై దాడిచేసి ఇంటి అద్దాలను పగలగొట్టారు. పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు. మాజీ మంత్రిని పోలీసులు ప్రత్యేక వాహనంలో అధిక భద్రత నడుమ మరో చోటికి తరలించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రత్యేక బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Leave a Reply