లైఫ్‌ని గాడిలో పెట్టే ‘వింటర్ ఆర్క్’..
సోషల్ మీడియాలో ‘వింటర్ ఆర్క్’ అనే కొత్త ట్రెండ్ హాట్‌టాపిక్‌గా మారుతోంది. పేరు కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.. అసలు వింటర్ ఆర్క్ అంటే ఏంటి? ఎందుకు జెన్-జెడ్ దీన్ని ఇంతగా ఓన్ చేసుకుంటోంది? ఈ నాలుగు నెలలనే ఎందుకు స్పెషల్‌గా చూస్తోంది? అసలు ఈ ‘వింటర్ ఆర్క్’ ట్రెండ్ వెనుక ఉన్న కథేంటో చూద్దాం..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జనవరి వచ్చిందంటే కొత్త ఇయర్.. కొత్త ఆశలు.. కొత్త గోల్స్. ‘ఈసారి మాత్రం నా లైఫ్ మారాలి’ అంటూ జిమ్, డైట్, స్టడీ, కెరీర్.. ఇలా ఎన్నో రిజల్యూషన్స్ పెట్టుకోవడం సాధారణం. మొదట్లో ఫుల్ మోటివేషన్‌తో మొదలుపెట్టినా.. కొన్ని రోజులు, కొన్ని వారాలు గడిచేసరికి రొటీన్ మారిపోతుంది. జిమ్‌కు బ్రేక్ పడుతుంది. డైట్ గాడి తప్పుతుంది. చదువు వాయిదా పడుతుంది. కానీ ఫోన్ యూసేజ్ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఫలితంగా కొందరి గోల్స్ వర్కౌట్ అవుతుండగా.. మరికొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. ఇంకొన్ని అసలు గుర్తే లేకుండా పోతాయి.
ఇక ఏడాది అనుకున్నట్టుగా సాగకపోవడం కూడా చాలామందిని డీమొటివేట్ చేస్తుంది. కెరీర్‌లో అనుకున్న బ్రేక్ రాకపోవచ్చు. ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు వర్కౌట్ కాకపోవచ్చు. కొన్ని రిలేషన్స్ దూరమై ఉండొచ్చు. పర్సనల్ లైఫ్‌లో బ్యాడ్ ఫేజ్‌లు ఎదురై ఉండొచ్చు. జనవరిలో ‘ఈ ఇయర్ మనదే’ అని అనుకున్న వాళ్లే.. కొన్ని నెలలు గడిచేసరికి ‘ఏంటి.. ఇయర్ అప్పుడే ఇలా అయిపోయింది?’ అనే ఫీలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఒక్కో నెల గడిచేకొద్దీ మోటివేషన్ తగ్గిపోవడం, గోల్స్‌పై ఫోకస్ తగ్గడం చివరికి ‘ఈ ఏడాది కూడా ఏం సాధించలేకపోయా’ అనే భావనకు దారితీస్తుంది.
అయితే ఇక్కడే నేటి యువత ఆలోచన కాస్త మారుతోంది. జనవరి నుంచి సెట్ కాలేదంటే వచ్చే జనవరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి?’ అనే ప్రశ్న నుంచి కొత్త ఐడియా వచ్చింది. ఏడాదిలో మిగిలిన నాలుగు నెలలను కూడా ఉపయోగించుకోవచ్చనే ఆలోచనతో సెప్టెంబర్‌ను కమ్‌బ్యాక్ పీరియడ్‌గా చూసే ట్రెండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఫెయిల్యూర్స్, డిస్ట్రాక్షన్స్‌ను పక్కన పెట్టి.. మిగిలిన సమయాన్ని తమపై తాము ఫోకస్ పెట్టేందుకు ఉపయోగించుకోవాలనే మైండ్‌సెట్ ఇందులో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘వింటర్ ఆర్క్’ అనే సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్ ట్రెండ్ పాపులర్ అవుతోంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న నాలుగు నెలలను తమ లైఫ్‌ను రీసెట్ చేసుకునే ఫేజ్‌గా యువత భావిస్తోంది. లైఫ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి తమకు తాముగా సెట్ చేసుకున్న ఈ రీసెట్ పీరియడ్‌నే ‘వింటర్ ఆర్క్’గా పిలుచుకుంటున్నారు. నాలుగు నెలల్లో పూర్తిగా మారిపోవడం కంటే.. ఇయర్ ఎండ్ వరకు తమ లైఫ్‌లో కొంతైనా పాజిటివ్ చేంజ్ తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం.
అసలు ‘వింటర్ ఆర్క్’ అంటే..
వింటర్ ఆర్క్ అనేది ఒకే రకమైన రొటీన్ లేదా ఫిక్స్‌డ్ ఛాలెంజ్ కాదు. వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మార్పులు ఉంటాయి. ఫిట్‌నెస్, స్లీప్, స్టడీ, కెరీర్, స్కిల్స్, ఫోన్ యూసేజ్, రిలేషన్స్, మెంటల్ స్పేస్.. ఇలా లైఫ్‌లోని వివిధ అంశాలను రివ్యూ చేసుకోవడం ఇందులో భాగంగా ఉంటుంది. లైఫ్ ఎక్కడ ట్రాక్ తప్పిందో గుర్తించడం, ఏ హ్యాబిట్స్ వెనక్కి లాగుతున్నాయో తెలుసుకోవడం, అవసరమైన చోట రొటీన్‌ను మార్చుకుని.. మళ్లీ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తారు.
అందుకే ఒకరి వింటర్ ఆర్క్ మరొకరిలా ఉండదు. ఒకరికి జిమ్, ఫిట్‌నెస్ ప్రధాన లక్ష్యం కావచ్చు. ఇంకొకరికి పరీక్షలు లేదా కెరీర్ ముఖ్యం కావచ్చు. మరొకరు స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టొచ్చు. బ్రేకప్ తర్వాత తమను తాము మళ్లీ బిల్డ్ చేసుకోవడంపైనా కొందరు దృష్టి పెట్టొచ్చు. అంటే.. ఎవరి లైఫ్‌లో ఏది అప్‌గ్రేడ్ కావాలో.. అదే వారి వింటర్ ఆర్క్‌గా మారుతోంది.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌కు డిఫరెంట్ అప్రోచ్
న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో కనిపించే ‘కొత్త ఏడాది.. కొత్త నేను’ అనే మైండ్‌సెట్‌కు భిన్నంగా వింటర్ ఆర్క్ ట్రెండ్ కనిపిస్తోంది. జనవరిలో ఒకేసారి ఎన్నో గోల్స్ పెట్టుకుని.. కొద్దిరోజులకే వాటిని కంటిన్యూ చేయలేకపోయే పరిస్థితికి బదులుగా.. ఏడాది మధ్యలోనే తమ ప్రోగ్రెస్‌ను రివ్యూ చేసుకుని, అవసరమైన మార్పులు చేసుకోవడంపై యువత ఫోకస్ పెడుతోంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్, ఫిట్‌నెస్, ప్రొడక్టివిటీ, హ్యాబిట్స్ వంటి కంటెంట్ పెరగడంతో ఈ కాన్సెప్ట్‌కు మరింత ఆదరణ లభిస్తోంది. ‘జనవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.. ఇప్పుడే ఎందుకు మొదలుపెట్టకూడదు?’ అనే ఆలోచన ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే సగం సంవత్సరం గడిచిపోయిందనే నిరాశకు బదులుగా.. మిగిలిన నాలుగు నెలలను ఉపయోగించుకోవడమే లక్ష్యంగా మారుతోంది.
మోటివేషన్ కాదు.. కన్సిస్టెన్సీ
వింటర్ ఆర్క్‌లో మరో కీలకమైన అంశం మోటివేషన్ కంటే కన్సిస్టెన్సీకి ప్రాధాన్యం ఇవ్వడం. ఫుల్ మోటివేషన్‌తో పది రోజులు ఏదైనా చేసి ఆపేయడం కంటే.. రెగ్యులర్‌గా కొనసాగించగలిగే రొటీన్‌ను బిల్డ్ చేసుకోవడంపై నేటి యువత దృష్టి పెడుతున్నారు. ‘మూడ్ ఉంటే చేస్తా’ అనే విధానానికి బదులుగా.. మూడ్ లేకపోయినా కంటిన్యూ చేయగలిగేలా హ్యాబిట్స్‌ను చిన్నగా, సింపుల్‌గా సెట్ చేసుకుంటున్నారు.
ఒకరోజు మూడు గంటలు ఫుల్ మోటివేషన్‌తో ఏదైనా చేయడం కంటే.. ప్రతిరోజూ 20 నిమిషాలు కంటిన్యూ చేయడం ఎక్కువకాలం ఉపయోగపడుతుందనే ఆలోచన ఇందులో ఉంది. మధ్యలో బ్యాడ్ డేస్ వచ్చినా.. ఒకరోజు రొటీన్ మిస్ అయినా.. దాన్ని ఫెయిల్యూర్‌గా చూడకుండా మళ్లీ ట్రాక్‌లోకి రావడమే ఈ ట్రెండ్ ప్రధాన మైండ్‌సెట్.
‘వింటర్ ఈజ్ కమింగ్’.. !
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్ చూసిన వారికి ‘వింటర్ ఈజ్ కమింగ్’ అనే డైలాగ్ తెలిసిందే. ఆ సిరీస్‌లో ఈ మాట ఓ కష్టకాలం ముందుందని.. దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలనే హెచ్చరికగా వినిపిస్తుంది. సమస్య వచ్చిన తర్వాత తేరుకోవడం కంటే.. అది ఎదురయ్యేలోపే సిద్ధంగా ఉండాలనే భావన ఇందులో ఉంటుంది. ఇదే ఆలోచనను ఇప్పుడు జెన్-జెడ్ తమ లైఫ్‌స్టైల్‌కు కనెక్ట్ చేసుకుంటోంది. డిస్ట్రాక్షన్స్, ఫెయిల్యూర్స్, కెరీర్ ప్రెజర్ వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు ముందుగానే మైండ్, బాడీ, రొటీన్‌ను సిద్ధం చేసుకోవాలనే ఆలోచన వింటర్ ఆర్క్ ట్రెండ్ లో కనిపిస్తోంది.
ఇది గ్లో-అప్ కాదు.. కమ్‌బ్యాక్!
సోషల్ మీడియాలో వింటర్ ఆర్క్ అంటే జిమ్, గ్లో-అప్, మార్నింగ్ రొటీన్, ప్రొడక్టివిటీ వంటివే ఎక్కువగా కనిపించినా.. దాని అసలు కాన్సెప్ట్ అంతకంటే సింపుల్. ఈ ఏడాది ఇప్పటివరకు అనుకున్నట్టు జరగకపోయినా.. మిగిలిన సమయాన్ని కూడా వదిలేయాల్సిన అవసరం లేదనే ఆలోచన దీనికి కేంద్రంగా ఉంది.
జనవరిలో పెట్టుకున్న గోల్స్ మధ్యలో ఆగిపోవడం, కెరీర్‌లో అనుకున్న ఛాన్స్ రాకపోవడం, రిలేషన్ వర్క్ అవ్వకపోవడం, ఏదైనా గోల్ రీచ్ కాకపోవడం.. వీటిలో ఏ ఒక్కటీ లైఫ్ మొత్తం ఫెయిల్ అయిందని అర్థం కాదు. అందుకే సెప్టెంబర్ నుంచి మళ్లీ మొదలుపెట్టి.. డిసెంబర్ వరకు తమకు సాధ్యమైన మార్పుపై ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు యువత.
వింటర్ ఆర్క్ లక్ష్యం పర్ఫెక్ట్‌గా మారడం కాదు. ఇప్పటివరకు ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి మళ్లీ మొదలుపెట్టడం.. తప్పిపోయిన ట్రాక్‌ను తిరిగి పట్టుకోవడం.. తమకు తామే మరో ఛాన్స్ ఇచ్చుకోవడం. వింటర్ ఆర్క్ అనేది కేవలం గ్లో-అప్ ట్రెండ్ మాత్రమే కాదు… లైఫ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు జెన్-జెడ్ ఎంచుకున్న కొత్త రీసెట్ మైండ్‌సెట్ అంటుంది నేటి యువత.
