రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఆరుతడి విత్తనాల పంపిణీలో ప్రభుత్వ విప్ విజయరమణారావు.. విద్యుత్ కొరత లేదని వెల్లడి
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ:
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్‌లో వ్యవసాయ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు సబ్సిడీపై ఆరుతడి విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. వేసవి పంటలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడంతో ఎనిమిది నియోజకవర్గాలకు నీరు విడుదలైందన్నారు.

దీంతో చెరువులు, కుంటలు, బావుల్లో నీటి మట్టం పెరిగిందని వివరించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో సుమారు 24 వేల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, చివరి తడికి నీరు అందక పది వేల ఎకరాల వరకు పంట నష్టపోయే పరిస్థితి తప్పిందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లలో విక్రయించుకోవచ్చని తెలిపారు. కరువు పరిస్థితులపై వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.