ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలి

ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు అయూబ్ పిలుపు

హనుమకొండ (ఆంధ్రప్రభ): ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న టీడబ్ల్యూయూ (TWU), ఎస్‌డబ్ల్యూయూ (SWU), ఐఎన్‌టీయూసీ (INTUC) ఐక్య కూటమి అభ్యర్థులను రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పిలుపునిచ్చారు.

ఆదివారం హనుమకొండ లోకల్ డిపో ప్రాంగణంలో ఐక్య కూటమి అభ్యర్థుల మద్దతుగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్మికులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మిక సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఆర్టీసీ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, కార్మికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికుల ప్రయోజనాల కాపలాదారుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంక సంపత్ యాదవ్, వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో డిపో కార్మికులు, నాయకులు పాల్గొని ఐక్య కూటమి విజయం కోసం నినాదాలు చేశారు.