భవానీ దీక్ష ఉత్సవాలకు వేళాయె!
నవంబరు 20 నుంచి జనవరి 3 వరకు ఉత్సవాలు
నవంబరు 20న మండల దీక్షల ప్రారంభం..
24న దీక్షల విరమణ ముగింపు
డిసెంబరు 24న కలశజ్యోతి నగరోత్సవం
డిసెంబరు 30 నుంచి జనవరి 3 వరకు దీక్ష విరమణలు
ఏర్పాట్లపై దృష్టిసారించిన దేవస్థానం అధికారులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష ఉత్సవాలకు దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర వార్షిక శ్రీ భవానీ దీక్ష ఉత్సవాలు నవంబరు 20, 2026 నుంచి జనవరి 3, 2027 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాల పూర్తి షెడ్యూల్‌ను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ వెల్లడించారు.
మండల, అర్ధమండల దీక్షల షెడ్యూల్..
భవానీ దీక్ష ఉత్సవాల్లో భాగంగా నవంబరు 20న కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉదయం 8.45 గంటలకు మండల దీక్షాధారణ కార్యక్రమం ప్రారంభం కానుంది. నవంబరు 24న కార్తీక పౌర్ణమి రోజున మండల దీక్షాధారణ సమాప్తమవుతుంది. అర్ధమండల దీక్షాధారణ డిసెంబరు 10న ప్రారంభమై డిసెంబరు 14న ముగియనుంది.
డిసెంబరు 24న కలశజ్యోతి నగరోత్సవం..
భవానీ దీక్ష ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కలశజ్యోతి కార్యక్రమాన్ని డిసెంబరు 24న మార్గశిర పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం (రామకోటి) నుంచి కలశజ్యోతి బయలుదేరుతుంది. అక్కడి నుంచి నగరోత్సవంగా కొనసాగుతూ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానానికి చేరుకోనుంది.
డిసెంబరు 30 నుంచి దీక్ష విరమణలు..
భవానీ మండల దీక్షా విరమణ కార్యక్రమాలు డిసెంబరు 30 నుంచి జనవరి 3 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. డిసెంబరు 30న ఉదయం 6.30 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, శత చండీయాగం ప్రారంభమవుతాయి. అదే రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. జనవరి 3న ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ముగియనున్నాయి.
భక్తులకు విస్తృత ఏర్పాట్లు..
భవానీ దీక్షలు చేపట్టే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా క్యూలైన్లు, ప్రసాద పంపిణీ, కేశఖండన, స్నానఘట్టాలు, దీక్ష విరమణ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి సారిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. భవానీ దీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర సమాచారం కోసం దేవస్థానం టోల్‌ఫ్రీ నంబరు 1800 425 9099ను సంప్రదించాలని ఈవో వి.కె. శీనా నాయక్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
