వెయ్యి రోజుల పాలన చారిత్రక మైలురాయి

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల పాలన చారిత్రక మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాయల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం సుదీర్ఘ కాలం పాలించినప్పటికీ భారీగా అప్పులు మిగిల్చిందని విమర్శిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం తక్కువ సమయంలోనే పేదలు, మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్ సరఫరా, రైతు బీమా అమలు, ధాన్యానికి బోనస్ వంటి చర్యలతో రైతులకు అండగా నిలుస్తోందన్నారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

విద్యారంగంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోందని తెలిపారు. 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు డైట్‌ చార్జీలు పెంచడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థలోనూ గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నామని రాయల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో గిడ్డంగుల సామర్థ్యాన్ని ఐదు లక్షల టన్నుల నుంచి 15 లక్షల టన్నులకు పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

మహిళల సంక్షేమంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పేదలకు ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్‌ కార్డుల జారీ వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.

సామాజిక న్యాయం విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి కార్యక్రమాలు సామాజిక సమానత్వానికి దోహదపడతాయని తెలిపారు.

వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని రాయల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని కోరారు.

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి హామీలను అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం ప్రభుత్వానికి కొనసాగాలని కోరారు.