భూమికి ప్రతీక… గుమ్మడి!


భూమిలాగా గోళాకారంలో ఉండే గుమ్మడికాయ మన సంస్కృతిలో అనాదిగా భూమికి ప్రతీకగా భావించబడుతోంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని విశ్వాంతరాళంలోని సముద్ర జలాలలో ముంచి వేయగా, శ్రీ మహావిష్ణువు తాను వరాహావతారం ధరించి తన కోరలతో భూమిని సముద్రాంతర్భాగం నుండి పట్టి ఎత్తి, హిరణ్యాక్షుడిని సంహరించి, భూదేవిని పరిణయమాడాడని పురాణ గాథలు చెబుతున్నాయి.
విష్ణు పత్నిగా పంచ భూతాలలో ఒకటిగా ప్రాణులకు ఆహారం, నీరు, ఖనిజాల వంటి అమూల్యమైన ఎన్నో సంపదలను ప్రసాదించే నేల తల్లిగా వెలసిన భూమిని శక్త్యానుసారం దానం చేయడం శ్రేష్ఠమైన దశ దానాలలో ఒకటిగా పురాణాలు పేర్కొన్నాయి. భూదానం చేసే వారికి అక్షయ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. భూదానం చేసిన దానితో సమానమైన ఫలితం భూమికి ప్రతీక అయిన గుమ్మడి కాయను దానం చేసినా లభిస్తుందన్నది పెద్దల మాట. తాను కోరిన మూడు అడుగుల నేలను త్రికరణ శుద్ధిగా దానమిచ్చిన బలి చక్రవర్తికి తక్షణమే పాతాళ లోకాధిపత్యాన్ని, తరువాత వచ్చే మన్వంతరంలో దేవేంద్ర పదవినీ ఆ శ్రీహరి ప్రసాదించినట్లు గుమ్మడికాయను దానమిచ్చిన వారికీ అ్టషశ్వర్యాలనూ అనుగ్రహించగలడు అనేది మన నమ్మకం.
మకరరాశికి శని అధిపతి. శని వాత ప్రధాన గ్రహమని జ్యోతిశ్శాస్త్రం చెబుతుంది. వాతం తగ్గడానికి నువ్వులు, నువ్వుల నూనె, గుమ్మడికాయ, మొదలైనవి వాడాలని ఆయుర్వేదం సూచిస్తుంది. అందుకే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని, నువ్వులను, గుమ్మడికాయలను ఆనాడు దానం చేయాలని పెద్దలంటారు. ప్రతి ఇంట్లో గుమ్మడికాయను పగులగొట్టి ఆవేళ కూర వండుతారు. ఇతర కూరగాయలతో పోలిస్తే గుమ్మడికాయ పెద్ద సైజులో ఉంటుంది. ఖరీదూ ఎక్కువే. అంత పెద్ద కాయను ఒక్క కుటుంబం తినలేదు. కనుకనే గుమ్మడికాయ ముక్కలను ఇరుగు పొరుగులతో పంచుకొంటారు.
గుమ్మడికాయను శుభానికి ప్రతీకగా, దృష్టి దోషాలను తొలగించే దైవ స్వరూపంగా ప్రజలు భావిస్తారు. అందుకే ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయను పసుపు వస్త్రంలో కట్టి ఉంచి వ్రేలాడదీస్తారు. అలా చేయడం వలన ఇంటికీ, ఇంటిలోని వారికీ ఎలాంటి చెడు దృష్టీ తగలదని ఒక నమ్మకం. గుమ్మడికాయతో దిష్టి తీయడం, దేవతలకు గుమ్మడి కాయతో హారతులివ్వడం, హూమ హవనాల చివరన గుమ్మడికాయను బలి ఇవ్వడం వంటి ఆచారాలు కూడా గుమ్మడికి సంబంధించి ఉన్నాయి.
గుమ్మడికాయకు పాశ్చాత్య దేశాలలో జరుపుకొనే ”హాలోవీన్‌” పండుగకు చాలా లంకె ఉంది. ప్రతి ఏటా అక్టోబర్‌ 31వ తేదీనాడు దాదాపు 130 కి పైగా దేశాలు ఈ ‘హాలోవీన్‌’ను జరుపుకొంటాయి. ఆ రోజున సాధువుల, సమీప బంధువుల ఆత్మలు ఈ లోకంలో సంచరిస్తూంటాయని నమ్ముతూ, వారిని గుర్తు చేసుకొంటూ జరుపుకొనే పండుగ ఇది. ఒక విధంగా చెప్పాలంటే భయాన్ని ఉత్సవంగా చేసుకొనే పండుగ ఇది.
హాలోవీన్‌కు నెలరోజుల ముందు నుండీ ఇళ్ళ గుమ్మాలలో గుమ్మడి కాయలను వివిధ రకాల ఆకారాలలో చెక్కి ఉంచుతారు. గుమ్మడి కాయను లాంతరులా చెక్కి అందులో క్యాండిల్స్‌ వెలిగిస్తారు. వీటిని ”జాక్‌-ఓ-లాంతర్లు” అంటారు. చిన్న పిల్లలకు రకర కాల దయ్యాల వేషాలు వేసి, వారికి కానుకలను, షుగర్‌ క్యాండీలను పంచు తారు. గుమ్మడికాయతో స్వీట్లు, కేకులు, సలాడ్లు, తయారు చేసి పంచుతారు. ఇలా ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా గుమ్మడికి చాలా ప్రాధాన్యత ఉంది. మన సంప్రదాయ వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *