ADB | పురి విప్పిన చైతన్యం..!

ADB | పురి విప్పిన చైతన్యం..!

  • ఆసిఫాబాద్ జిల్లాలో 84.5%… పోలింగ్
  • ఆదిలాబాద్ లో 83.80 శాతం..
  • మంచిర్యాలలో 79.2 % ఓటింగ్..
  • బేల మండలం కడికి గ్రామంలో ఎన్నికల బహిష్కరణ..
  • మావలలో ఓట్ల గల్లంతుపై ప్రజల ఆగ్రహం..
  • ఉమ్మడి ఆదిలాబాద్ లో రెండో విడత పంచాయతీ పోరు ప్రశాంతం..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కీలక ఘట్టం ప్రశాంతంగా మూసింది. హిమపాతాన్ని తలపించే చలిని లెక్కచేయకుండా పల్లె ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పరిధిలోని 500 గ్రామపంచాయతీలు, 3,721 వార్డు స్థానాలకు ఈరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ జరిగింది. రెండో విడతలో 30 గ్రామపంచాయతీలు ఇదివరకే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అక్షరాస్యతలు వెనుకబడ్డ పట్టణ ఓటర్ల కంటే పల్లె ఓటర్లు , ముఖ్యంగా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలివచ్చి పవిత్రమైన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 8 మండలాల్లో 139 గ్రామపంచాయతీలకు ఎన్నిక జరగగా, పోలింగ్ ముగిసే సమయానికి 83.80 శాతం ఓటింగ్ జరగడం విశేషం. మొత్తం 1,32,438 ఓటర్లకు గాను, 1,10, 985 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏజెన్సీ గ్రామాలు అధికంగా ఉన్న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈసారి ఓటర్ల చైతన్యం వెల్లి వెరిసింది. ఈ జిల్లాలోని ఆరు మండలాల్లో ఎన్నిక జరగగా 84.52 శాతం పోలింగ్ జరిగింది.1,31,378 మంది ఓటర్లకు గాను ఈ జిల్లాలో ఒకటి 1,11,011 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ జిల్లాలోని దహేగాం మారుమూల మండలంలో 90 శాతం ఓటింగ్ జరగడం రికార్డుగా చెప్పవచ్చు. పెంచికల్పేట్ మండలంలో 88.72 శాతం పోలింగ్ నమోదయింది.

మంచిర్యాల జిల్లాలో 79.2 శాతం ఓటింగ్..

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి,భీమిని, కన్నెపల్లి, కాశీపేట్ , నేన్నిల, తాండూర్ మండలంలో 1,37, 382 మొత్తం ఓటర్లకు గాను, 1,08, 808 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ జిల్లాలో 111 గ్రామ పంచాయతీలకు ఈరోజు రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగింది.

ఇక నిర్మల్ జిల్లాలోని ఏడు మండలాలలో 131 గ్రామ పంచాయతీలకు 80% పోలింగ్ జరిగినట్టు తెలిసింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినయ్ నిర్మల్ మండలం డ్యాంగ పూర్ పంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆదిలాబాద్ కలెక్టర్ మావల మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించగా ఎస్పీ అఖిల్ మహజాన్ జైనథ్ మండలంలోని పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు. అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓటు హక్కు బహిష్కరించిన కడికి గ్రామస్తులు..!

ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం గణేష్ పూర్ పంచాయతీ పరిధిలోని కడిగి గ్రామ గిరిజనులు ఈరోజు తమ ఓటు హక్కును బహిష్కరించారు. తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నామని, ప్రతిసారి అధికారులు, ప్రజాప్రతితులు హామీలు ఇస్తున్నా నేటి వరకు పరిష్కరించలేదని వారు అధికారులను నిలదీశారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకొని మా పల్లెపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటింగ్ బహిష్కరించిన మహిళలు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మొత్తం 103 మంది ఓటర్లు ఉన్న ఈ తండాలో కేవలం ముందుగా ముగ్గురు మాత్రమే ఓటు వేసినట్లు, మిగతా 100 మంది బహిష్కరించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో 180 ఓట్లు గల్లంత కావడంపై 170 సర్వే నంబర్ లోని ఓటర్లు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఈ ఓట్లు బదలాయించడం వల్ల పంచాయతీలో గల్లంతయినట్టు అధికారులు చెప్పారు.

Leave a Reply