ద్రౌపది జరిగిన అవమానమే మాకు జరిగింది : స‌బితారెడ్డి

మా జుట్టు, చీర లాగి మమ్మల్ని అవమానించారు
అసెంబ్లీ ఘటనపై సబితా ఇంద్రారెడ్డి ఆవేదన
“మా గురించి సభలో ఎందుకు చర్చ పెట్టలేదు?” అంటూ ప్రశ్న
మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించకుండా, మరో అంశాన్ని సభలో చర్చకు తీసుకురావడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. “అనని మాటను కూడా స్పీకర్‌కు ఆపాదించి.. అమ్మకు అన్యాయం జరిగిందని సభలో చర్చ పెట్టారు. మరి అక్కాచెల్లెళ్లుగా మేము ఏం పాపం చేశాం? మా గురించి సభలో ఎందుకు మాట్లాడలేదు?” అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

“మమ్మల్ని అవమానించారు”

అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ సబితా ఇంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పట్ల జరిగిన వ్యవహారం తీవ్ర అవమానకరమని, “ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది. మా జుట్టు, చీర లాగి మమ్మల్ని అవమానించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన ఘటనపై ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతోందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించడం లేదని ఆరోపించారు.
మేము అసెంబ్లీలోకి వెళ్లే టైంలో.. మహిళా పోలీసులు తప్పుకుని మగ పోలీసులు వచ్చేశారు.. ఆ తరువాత నా జుట్టు, గొంతు పట్టి.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానకరంగా ప్రవర్తించారు.. మేం ఏం తప్పు చేశామని మా పట్ల ఇలా ఎందుకు ప్రవర్తించారో తెలియక మదన పడుతున్నాం అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

జాతీయ స్థాయిలో ఫిర్యాదు

అసెంబ్లీ ఘటనపై బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అసెంబ్లీ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహిళా ఎమ్మెల్యేల భద్రత, గౌరవానికి సంబంధించిన అంశంగా దీనిని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావిస్తున్నారు.