యాదవుల ఐక్యతకు ప్రతీక సదర్ వేడుకలు..
- హైదరాబాద్ నుంచి ఏపీ వరకు విస్తరించిన సదర్ ఉత్సవాలు
- ఐక్యతతో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలి
- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
యాదవుల ఐక్యతకు ప్రతీకగా సదర్ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీపావళి మరుసటి రోజు నిర్వహించే సదర్ ఉత్సవాలు యాదవుల ఐక్యతను చాటుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఎన్‌టీఆర్ స్టేడియం వద్ద మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి తలసాని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులు ఏడాది పొడవునా తమ వృత్తి, పాడి పరిశ్రమ పనుల్లో నిమగ్నమై ఉంటారని గుర్తు చేశారు. దీపావళి మరుసటి రోజు సదర్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవాలు ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.
రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల చరిత్రను పరిశీలించినా యాదవుల ప్రస్తావన ఉంటుందని తలసాని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తొలుత తెరిచేది కూడా యాదవుడేనని పేర్కొన్నారు.
సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవులు ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సదర్ సమ్మేళనం నిర్వాహకులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు.
