ఓటు హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చిన వరం
ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: ఓటు హక్కు భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన వరం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, ఎమ్మెల్యే తనయుడు, కోడలు మండలి వెంకట్రామ్ – సాయి సుప్రియ దంపతులు కలసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిలుస్తారన్నారు. ప్రజాసేవా దృక్పథం కలిగిన వారిని అభివృద్ధి కాముకులను ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజానీకంపై ఉందన్నారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఓటు వేసే మహోన్నత అవకాశాన్ని ఎవరూ జారవిడిచి పెట్టవద్దని కోరారు.
