రామగుండం నవనిర్మాణమే ప్రధాన కర్తవ్యం

ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, ఆంధ్రప్రభ:
నిరుపేద వర్గాల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని జంగాలపల్లి (ఎన్టిపిసి) లో 634 మంది లబ్ధిదారులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను అందజేశారు. లబ్ధిదారులకు ఇండ్ల తాళాలను అప్పగించారు. సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రసంగించారు.

రామగుండం అభివృద్ధి కోసం… ప్రజల సంక్షేమం కోసం… రక్షకుడిగా ఉంటానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పాలకుల కుట్రపూరిత నిర్ణయాల మూలంగా రామగుండం వెనుకబడిందని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులు…విద్యుత్ కేంద్రాలు, సిమెంట్ కర్మాగారాలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వీరాంజనేయ ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని… అయితే రామగుండం నవనిర్మాణమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని మక్కన్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక నగరంగా రామగుండం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని , అందుకు తాను ముందుండి పని చేస్తానని ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. విమర్శలకు ఆరోపణలకు భయపడేది లేదని రామగుండం ప్రజానీకం కూడా ఎవరికి భయపడొద్దని…దళారీ వ్యవస్థను అడ్డుకుంటాం… ఓట్ల కోసం రాజకీయం చేయడం మాకు చాతకాదనీ మక్కాన్సింగ్ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, ఇన్చార్జి కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య తోపాటు కార్పొరేటర్లు, వేలాదిమంది లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.