రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
పారదర్శకంగా భూ హద్దుల గుర్తింపు.. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
పోచంపల్లిలో రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ
రేగొండ, ఆంధ్రప్రభ: భూముల రీ సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే పురోగతి, భూముల మ్యాపింగ్, పొడి, తడి భూముల గుర్తింపు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇప్పటివరకు 443 ఎకరాల భూమికి రీ సర్వే పూర్తయినట్లు అధికారులు వివరించారు. పోచంపల్లి, లింగాల గ్రామాల్లో రెండు ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్.. భూముల హద్దుల గుర్తింపులో రైతులు సహకరించాలని సూచించారు. సర్వేలో ఏవైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయ్యాక రైతులకు నోటీసులు జారీ చేస్తామని, వాటిపై 60 రోజుల్లోగా అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలోని చెరువులు, పంట కాలువల ఆక్రమణలను తొలగించి వాటిని పరిరక్షించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన సంబంధిత ఇరిగేషన్ అధికారులతో విచారణ జరిపించి, ఆక్రమణలు ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రీ సర్వేతో భూముల హద్దులు స్పష్టమవడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి, భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, తహసీల్దార్ శ్వేతారావు, సర్పంచ్ కేసిరెడ్డి సబితా-ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి రాజ్‌కుమార్, సర్వే సిబ్బంది, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
