ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
ముందస్తు అరెస్టులను ఖండించిన మ్యాకల శ్రీకాంత్ యాదవ్
బెజ్జంకి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) బెజ్జంకి మండల అధ్యక్షుడు మ్యాకల శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇటీవల ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
అర్హులైన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, గౌరవ పెన్షన్లు అందించాలని, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఫోరం నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని విమర్శించారు. అరెస్టులతో ఉద్యమకారుల గొంతును నొక్కలేరని, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంతో పాటు అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు శ్రీనివాస్ గుప్తా, లింగాల లక్ష్మణ్, చెరుకూరి నర్సయ్య, ముక్కిస తిరుపతిరెడ్డి, జెరిపోతుల మధు, శానగొండ శరత్, బోడిగే అనిల్ తదితరులు పాల్గొన్నారు.
