పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశం
ఉరవకొండ, ఆంధ్రప్రభ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న రెండో సాధారణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉరవకొండ, వజ్రకరూర్, కూడేరు మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా తరలించాలని, పంపిణీ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ నిర్ణీత సమయానికి ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.
పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పారదర్శకంగా విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సి. విష్ణు చరణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఆర్వోలు సాలు రెడ్డి, ఎంపీడీవో రవి ప్రసాద్, తహసీల్దార్లు అరుణ, జయశ్రీ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, కూడేరు ఆర్వో జుబేదా బేగం తదితరులు పాల్గొన్నారు.
