పైరసీ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్(Cybercrime) పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) వెల్లడించారు. ఈ ముఠా వైరసి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనివల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.
డిజిటల్ శాటిలైట్‌ను హ్యాక్…
టెలిగ్రామ్ చానల్స్, టొరెంట్స్(Telegram Channels, Torrents) ద్వారా సినిమాల పైరసీ జరుగుతోందని పోలీసులు గుర్తించారు. థియేటర్(Theater)కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారు. డిజిటల్ శాటిలైట్(Digital Satellite)ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారని సీపీ తెలిపారు. పైరసీ సినిమాలు అప్లోడ్(Upload) చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ‘సింగిల్’. ‘హిట్’ సినిమాల పైరసీ జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని, పైరసీ కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ మరొకరికి పంపించాడు.
పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్‌లో ఉన్నట్లుగా గుర్తించామని సీపీ తెలిపారు. ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ విన్ కంటెంట్(Channel Win Content)ను కూడా నిందితులు పైరసీ చేసి అమ్ముకున్న హర్షవర్ధన్ అనే నిందితుడు చెప్పారన్నారు.
రికార్డు చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్‌సైట్లకు విక్రయిస్తూ పైరసీ ముఠా సొమ్ము చేసుకుంటుందని తెలిపారు. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్(Password)లను కూడా క్రాక్ చేస్తున్నట్లుగా నిర్ధారించామని తెలిపారు. ముఖ్యంగా ఏజెంట్లను అడ్డం పెట్టుకుని ఎవరికీ ఎక్కడా అనుమానం రాకుండా కంటెంట్‌ను రికార్డు చేయిస్తున్నారని అన్నారు. కొత్త సినిమా విడుదలైన మొదటి రోజే ఏజెంట్లకు ముఠా ఫస్ట్ షో టికెట్లు(First Show Tickets) బుక్ చేసి హై రిజల్యూషన్ రికార్డింగ్ ఎక్విప్‌మెంట్‌ను ఇచ్చి ఫుటేజీ తీసుకుంటున్నారని తెలిపారు.
థియేటర్లలో రహస్యంగా ఎలా రికార్డు చేయాలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారని వెల్లడించారు. ఓ నిందితుడికి బెట్టింగ్ యాప్ నుంచి నెలకు దాదాపు రూ.9 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించామని అన్నారు. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్(Crypto Currency Payments) ద్వారా తమకు కొంత కేసులో క్లూ దొరికిందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేశారని మీడియా దృష్టి తీసుకొచ్చారు. చివరికి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా వదల లేదని అన్నారు.

