ఊపిరి పీల్చుకున్న పోలవరం ప్రజలు.. గోదావరి దాటి వెళ్లిన పెద్దపులి

సింగన్నపల్లి వద్ద నది దాటిన పులి..
శాటిలైట్‌ ట్రాకర్‌తో కదలికల గుర్తింపు

పోలవరం, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి ఎట్టకేలకు పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో పోలవరం మండల పరిసర ప్రాంతాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన పాత చేగొండ పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తించింది. పులి కదలికలను గుర్తిస్తూ, దానిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి సింగన్నపల్లి వద్ద పెద్దపులి గోదావరి నదిని దాటి పోలవరం జిల్లాలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి పోలవరం జిల్లా కొయ్యూరు ముంపు గ్రామంలోకి ప్రవేశించినట్లు దాని మెడకు అమర్చిన శాటిలైట్‌ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్‌ ద్వారా గుర్తించినట్లు అటవీ క్షేత్రాధికారి ఎస్‌కే వలీ తెలిపారు.

పులి కదలికలు పోలవరం ప్రాంతం నుంచి దూరంగా వెళ్లినట్లు సమాచారం అందడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.