బీసీ పథకాల అమలులో వేగం పెంచాలి..

  • గురుకులాలు, స్కాలర్‌షిప్‌లు, ఉపాధి పథకాలపై మంత్రి పొన్నం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష నిర్వహించారు. బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కుట్టు మిషన్ల పథకానికి భారీ స్పందన లభించిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 1,80,170 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

కుట్టు మిషన్ల పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రొక్యూర్‌మెంట్‌, టెండర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్‌ 7లోపు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి, అనంతరం ప్రీ బిడ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన మహిళలందరికీ ఈ పథకం చేరేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోపు అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

ఇటీవల ఎన్నికైన బీసీ కుల సంఘాల కార్పొరేషన్ల చైర్మన్లకు అవసరమైన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించి, పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీసీ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి.. రాష్ట్రంలోని 327 మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల పనితీరు, మౌలిక వసతులు, భవనాల పరిస్థితి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. ప్రస్తుతం 22 గురుకుల పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని అధికారులు వివరించగా.. మిగిలిన పాఠశాలలకు అవసరమైన స్థలాలు, భవనాలపై ఈ నెల 15లోపు సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు.

గురుకుల పాఠశాలలకు అవసరమైన స్థలాల గుర్తింపు, భవనాల నిర్మాణానికి సంబంధించి చర్యలను వేగవంతం చేసేందుకు నలుగురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు యూనిఫాంలు, షూస్‌, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అద్దెలు, బిల్లుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

విదేశీ విద్య కోసం అందించే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

హైకోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీసీ స్టడీ సర్కిళ్లను ఆధునికీకరించాలని మంత్రి పేర్కొన్నారు. గ్రూప్స్‌, పోలీస్‌ ఉద్యోగాలు, ఇతర పోటీ పరీక్షలతో పాటు నైపుణ్య శిక్షణ అందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

గీత కార్మికుల భద్రతకు సంబంధించిన కాటమయ్య రక్షణ కవచాల పంపిణీపై కూడా సమీక్ష జరిగింది. శిక్షణ పూర్తి చేసిన ప్రతి గీత కార్మికుడికి రక్షణ కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో కనీసం 10 రక్షణ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

నీరా కేఫ్‌ రీటెండర్‌ను సెప్టెంబర్‌ 7లోపు, నందనం ప్రాజెక్టు రీటెండర్‌ను సెప్టెంబర్‌ 15లోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఆధునిక దోబీఘాట్‌ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

మొదటి దశలో హుస్నాబాద్‌, హుజురాబాద్‌, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో ఆధునిక దోబీఘాట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు.