వారిపై మున్సిపల్ కార్పొరేషన్ కొరడా..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) అప్రమత్తమైంది. ప్రమాదకర, అనధికార భవనాలపై చర్యలను ముమ్మరం చేసింది. భద్రత లేని భవనాలు, అక్రమ నిర్మాణాలు, భవనాల దుర్వినియోగంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
ప్రమాదకర, శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి.. ప్రమాద తీవ్రత ఆధారంగా వాటిని వివిధ కేటగిరీలుగా విభజించాలని ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి, ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ అన్ని జోన్ల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రమాద తీవ్రతను బట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల భవనాలను సీజ్ చేయడంతో పాటు ప్రమాదకర నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు.
సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలిపోవడంతో.. ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు ముగిసే సమయానికి మొత్తం 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పరిసర ప్రాంతాల్లోని ఇతర భవనాలపై ఎంసీడీ ప్రత్యేక దృష్టి సారించింది.
కూలిన భవనం సమీపంలోని మరో భవనం కూడా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దానిని ఖాళీ చేయించి కూల్చివేతకు చర్యలు చేపట్టారు. అధికారులు మరో మూడు భవనాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదకర నిర్మాణాలపై కూల్చివేత నోటీసులు జారీ చేస్తున్నారు. ఎంసీడీ 24 ఆస్తులపై కూల్చివేత చర్యలు చేపట్టి, ఏడు అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకుంది. అనధికార నిర్మాణాలకు సంబంధించి 26 షోకాజ్ నోటీసులు, సీలింగ్‌కు సంబంధించి నాలుగు షోకాజ్ నోటీసులు, 12 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు సత్య నికేతన్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు అత్యవసర ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఘటనకు సంబంధించి ప్రభుత్వ అధికారుల బాధ్యతపై ప్రశ్నలు సంధించింది. ఈ ఘటన నేపథ్యంలో ఎంసీడీ దక్షిణ జోన్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్ రాకేశ్ గుప్తా సహా ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
భవనం కూలిన ఘటనతో సత్య నికేతన్‌లోని పలు పేయింగ్ గెస్ట్ వసతుల్లో ఉంటున్న విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. పలువురు విద్యార్థులు తమ సామాన్లతో వసతి గృహాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిసర ప్రాంతాల్లోని ప్రమాదకర భవనాలపై అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో మరిన్ని నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు పేయింగ్ గెస్ట్ వసతులు, కోచింగ్ సంస్థలను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించనుంది. నెలన్నరలో ప్రత్యేక విధానంతో పాటు వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా దేశవ్యాప్తంగా పేయింగ్ గెస్ట్ వసతుల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.
భవనాల భద్రత, నిర్మాణ అనుమతులు, నిబంధనల అమలుపై క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని ఎంసీడీ నిర్ణయించడంతో ఢిల్లీలో అక్రమ, ప్రమాదకర నిర్మాణాలపై చర్యలు మరింత ముమ్మరం కానున్నాయి.
