వీర తెలంగాణ పోరాట వారసత్వాన్ని కాపాడాలి

మతోన్మాదం, మనువాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం నాటి పోరాటం
సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో బెల్లంకొండ వెంకటేశ్వర్లు

కోదాడ, ఆంధ్రప్రభ: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాటి పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దొరలు, జాగీర్దారులకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో కీలక ఘట్టమని అన్నారు. నాటి పోరాట చరిత్రను, పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

నిజాం పాలన, భూస్వాములు, జమీందారులు, రజాకార్ల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా గ్రామీణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వృత్తిదారులు ఐక్యంగా పోరాడారని తెలిపారు. ఎర్రజెండా నాయకత్వంలో సాగిన ఈ పోరాటంలో ‘దున్నేవానికి భూమి’ అనే నినాదం ప్రధానంగా నిలిచిందన్నారు.

నాటి పోరాట ఫలితంగా పెద్ద ఎత్తున భూమి పేదలకు దక్కిందని, అనేక గ్రామాలు విముక్తి పొంది గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారు. వేలాది మంది ప్రజలు, పోరాట యోధులు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో భూమి, వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీ వంటి అంశాలు కీలకంగా ఉన్నాయని చారిత్రక పాఠ్యాంశాల్లోనూ నమోదైంది.

నేటి పరిస్థితుల్లో అభివృద్ధి పేరుతో పేదల భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించకుండా చూడాలని ఆయన కోరారు. భూమి, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, సంక్షేమ పథకాల అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అమరులకు ఘన నివాళి

కార్యక్రమం ప్రారంభంలో రత్నవరం గ్రామ తొలి సర్పంచ్‌, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్‌ పగడాల రామ్‌రెడ్డి చిత్రపటానికి గ్రామ సర్పంచ్‌ దాట్ల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పోరాట యోధులు కన్నెబోయిన లింగయ్య, కన్నెబోయిన నరసయ్య చిత్రపటాలకు మాజీ సర్పంచులు పగడాల పద్మ, ప్రభాకర్‌రెడ్డి, పసుపులేటి వినయ్‌వర్ధన్‌ తదితరులు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య, అభ్యుదయ అకాడమీ రాష్ట్ర నాయకుడు మొలుగూరి సురేష్‌, పగడాల రామ్‌రెడ్డి ప్రథమ కుమారుడు బుచ్చిరెడ్డి, గ్రామ పెద్దలు సోమ వీరయ్య, కాసాని శ్రీనివాసరావు, కూరాకుల కృష్ణమూర్తి, పల్లి సంజీవరెడ్డి, కన్నెబోయిన భాస్కరరావు, కన్నెబోయిన ఉప్పలయ్య, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు మొలుగూరి సైదులు, వార్డు సభ్యులు మిరియాల శ్రీను, కూరాకుల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ రాంబాబు, కలకొండ వీరయ్య, మాజీ ఉపసర్పంచ్‌ మొలుగూరి ఉపేందర్‌, పగడాల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎంపీ వీఎల్‌ఎన్‌ గౌడ్‌, రామిని నర్సిరెడ్డి, కూరాకుల శ్రీరాములు, పగడాల రామకృష్ణారెడ్డి, మిర్యాల గురుస్వామి, రాజుల వెంకట్‌రాములు తదితరులు పాల్గొన్నారు.