భూముల రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి
రైతులకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలి.. కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : భూముల రీ సర్వే పనులను ఎలాంటి తప్పులకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
బుధవారం మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, తొంబరావుపేట గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతి, భూ రికార్డుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు, భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా సర్వే చేపట్టాలని సూచించారు.
భూముల హద్దులు, విస్తీర్ణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలన్నారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని, భూ రికార్డుల్లో కచ్చితత్వం ఉండేలా పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జీవాకర్రెడ్డి, మేడిపల్లి తహసీల్దార్, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
