గుంటూరు మేయర్ సీటుపై పవన్ పట్టు!
విజయవాడతో సరిపెట్టుకోవాలంటున్న చంద్రబాబు?
టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ.. బీజేపీకి మరో సీటు డిమాండ్!
గుంటూరు మేయర్ పీఠంపై ఆశావహుల చూపు.. వైసీపీలో మాత్రం మౌనం!
గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే గుంటూరు మేయర్ పీఠం కూటమి రాజకీయాల్లో కీలక చర్చకు తెరలేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న టీడీపీ, జనసేనలు నగర మేయర్ సీటును దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా గుంటూరు మేయర్ సీటుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారని, అయితే ఈ సీటును టీడీపీ తన వద్దే ఉంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుంటూరు స్థానానికి బదులుగా విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో కూటమి రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
