గుడిసెలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలి
బిక్కనూర్, ఆంధ్రప్రభ: గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
బుధవారం బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వారు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఇంటి నిర్మాణ దశల ఆధారంగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుందని పేర్కొన్నారు. నిర్మాణాల్లో నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
