ప్రభుత్వమే మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేయాలి
వైఎస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి
బాపట్లలో విద్యార్థులు, ప్రజల నిరసన గళం
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా నిర్మాణ దశలో ఆగిపోయిన వైద్య కళాశాలను ప్రారంభించకపోవడంతో పేద విద్యార్థులు దగా పడుతున్నారని వైఎస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే మెడికల్ కళాశాల నిర్మాణం చేయాలని కోరుతూ బుధవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోన రఘుపతి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు, ప్రజలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ సీతా భవానికి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా ఉద్యమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వమే వైద్య కళాశాలల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు తీసుకోవటం వలన పేదలకు మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో రూ.550 కోట్లతో చేపడుతున్న ఈ కళాశాలలో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థులు, 150 మంది పారా మెడికల్ విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం లభించనుందన్నారు.

దీంతోపాటు పలు వ్యాధులకు సంబంధించిన పరిశోధనలు కూడా ఉచితంగా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. బాపట్లలో ఈ వైద్య కళాశాల నిర్మాణానికి రూ.కోట్ల విలువైన 56 ఎకరాల భూమిని ఉచితంగా ప్రభుత్వానికి అందించటం జరిగిందన్నారు. బాపట్ల ప్రాంతాభివృద్ధికి వైద్య కళాశాల ఎంతో దోహదపడుతుందన్నారు. బాపట్ల వైద్య కళాశాల నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టేలా నాబార్డు నుంచి కూడా నిధులు విడుదల అయ్యాయన్నారు. ఇప్పటికే రూ. 84 కోట్లు విలువైన పనులు జరుగగా, రూ.64 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించామన్నారు. మిగతా నిర్మాణ పనులు సజావుగా సాగితే 2026 ఏడాదికి బాపట్ల ప్రభుత్వ వైద్య కళాశాల అడ్మిషన్లు ఇచ్చే స్థాయిలో ఉండేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా వ్యవహరించి వైద్య కళాశాలలను అడ్డుకున్నారని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రం 2,450
ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయిందని పేర్కొన్నారు.
రూ. లక్షల కోట్ల విలువైన సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే చంద్రబాబు పీపీపీ పేరిట కుట్ర పన్నారని కోన విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలల్లో రూ. రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారని, ప్రభుత్వ వైద్య కళాశాల కోసం రూ.5000 కోట్లు వెచ్చించలేరా అని ప్రశ్నించారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మెడికల్ కళాశాల నిర్మాణం పిపిపి మోడ్ లో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.

