పార్టీ బలోపేతమే లక్ష్యం..

  • ఈ నెలాఖరులోపు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామక ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవిని బాధ్యతగా, సంతృప్తిగా నిర్వహించానని అన్నారు. కార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీకి బలాన్ని చేకూర్చామని, బూత్‌ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేశామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తన వేవ్‌లెంగ్త్‌ సరిపోయిందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. రెండేళ్ల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లామని, చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా సమర్థవంతంగా అధిగమించామని అన్నారు. రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ నేతలు మీనాక్షి నటరాజన్‌, దీపాదాస్‌ మున్షీ సహకారంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌తో కలిసి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

కుల సర్వేతో సామాజిక న్యాయం

తెలంగాణలో కుల సర్వే ద్వారా నిజమైన సామాజిక న్యాయం జరిగిందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ ఆశయానికి అనుగుణంగా కుల సర్వేను శాస్త్రీయంగా, సమర్థవంతంగా నిర్వహించిన సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కుల సర్వే అంశాన్ని పక్కన పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కుల సర్వే అమలు చేస్తామని చెప్పారు.

ఏఐసీసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని బూత్‌ స్థాయి వరకు తీసుకెళ్లామని తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల్లో 57 శాతం వరకు బీసీలు విజయం సాధించారని, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించామని చెప్పారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల ఎంపికలో కొత్త విధానాన్ని అమలు చేశామని తెలిపారు. ఢిల్లీ నుంచి అబ్జర్వర్లను పంపించి సమీక్షించిన తర్వాతే డీసీసీ అధ్యక్షులను ప్రకటించినట్లు వెల్లడించారు.

సీఎంతో ఎలాంటి గొడవ లేదు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తనకు ఎలాంటి గొడవ జరగలేదని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమేనని, తమ మధ్య గ్యాప్‌ ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. “సీఎంతో అభిప్రాయ భేదాలు వచ్చినా సాయంత్రానికే పరిష్కరించుకున్నాం. పార్టీ విషయంలో సీఎం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు” అని తెలిపారు. మంత్రి కొండా సురేఖను తొలగించిన విషయంలో తాను కూడా బాధపడ్డానని చెప్పారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే ఆ చర్య తీసుకున్నామని, క్రమశిక్షణ విషయంలో హద్దు దాటితే ఎవరిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

త్వరలో వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం

ఈ నెలాఖరులోపు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామక ప్రక్రియ పూర్తవుతుందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. సొసైటీ నియామకాల్లో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కార్యకర్తల విషయంలో ఎమ్మెల్యేల నుంచి కొన్ని సూచనలు వచ్చినా.. మండల అధ్యక్షుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మండల అధ్యక్షుల నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వడంపై ఏఐసీసీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే టికెట్లలో డీసీసీల అభిప్రాయం కీలకం

ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల అభిప్రాయం కీలకంగా ఉంటుందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. పీఏసీలో ఎమ్మెల్యే టికెట్లపై చర్చకు ముందు డీసీసీ అధ్యక్షుడి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వారు తప్పనిసరిగా డీసీసీ అధ్యక్షుడిని కలవాలని సూచించారు. నామినేటెడ్‌ పదవుల భర్తీలో కూడా డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు.