నిరుపేదలకు ఉచిత వైద్య సేవలే లక్ష్యం
- సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధుమేహం, మూత్రపిండాల వైద్య శిబిరం
- 62 మందికి వైద్య పరీక్షలు.. వ్యాధులపై అవగాహన కల్పించిన వైద్యులు
ఖమ్మం, ఆంధ్రప్రభ :
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడంతోపాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా జంగాల రాజేశ్వర్‌రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మధుమేహం, మూత్రపిండాల వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 62 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సూచనలు అందించారు.
మధుమేహం, మూత్రపిండాల పరీక్షలు
శిబిరంలో మధుమేహానికి సంబంధించి 28 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 28 మందికి ఉపవాస రక్త చక్కెర (ఫాస్టింగ్ షుగర్), 28 మందికి భోజనానంతర రక్త చక్కెర (పీపీఎస్ఎస్) పరీక్షలు చేశారు. 27 మందికి హెచ్‌బీఏ1సీ పరీక్ష నిర్వహించి, రక్తంలో చక్కెర స్థాయులు, మధుమేహ నియంత్రణ పరిస్థితిని అంచనా వేశారు.
మూత్రపిండాల సంబంధిత సమస్యలను గుర్తించేందుకు 34 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురికి యూరియా, 24 మందికి క్రియేటినిన్, ముగ్గురికి సీయూఈ పరీక్షలు చేశారు. 21 మందికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన వైద్య సూచనలు అందించారు.
ముందస్తు పరీక్షలతో వ్యాధుల నియంత్రణ
ఈ సందర్భంగా సాయిరామ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ జంగాల (ఎండీ, డీఎం గ్యాస్ట్రోఎంటరాలజీ), ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జంగాల స్వాతి (ఎంబీబీఎస్, డీ.డయాబ్) మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం, మూత్రపిండాల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్ర అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు.
కాలేయ ఆరోగ్యంపై నిరంతర అవగాహన
2017 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జంగాల రాజేశ్వర్‌రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్‌ను స్థాపించినట్లు వారు వివరించారు. అప్పటి నుంచి కాలేయ వ్యాధుల నివారణ, కాలేయ ఆరోగ్య పరిరక్షణపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా హెపటైటిస్-బీ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కాలేయ వ్యాధులు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలకు దూరమవుతున్న పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. వైద్య పరీక్షల ఖర్చును భరించలేని వారికి ఇలాంటి ఉచిత శిబిరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు, వ్యాధులపై ముందస్తు అవగాహన కల్పించేందుకు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ శిబిరంలో సాయిరామ్ హాస్పిటల్స్ వైద్య, క్లినిక్ సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు పాల్గొని సేవలందించారు.
