బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యం
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం ద్వారానే సామాజిక, రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కర్నూలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు యాదవ్, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రం సింగ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కె.ఇ. జగదీష్, బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.వి. ప్రసాద్ తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో సుమారు 16,800 రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియకు వైసీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.
బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ ధోరణి వైసీపీకి ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీల రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్న వైసీపీని ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక పార్టీ’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు.
20 శాతం నుంచి 34 శాతానికి..
బీసీల సామాజిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్టీ రామారావు హయాంలో 1987లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని టీడీపీ నేతలు తెలిపారు. అనంతరం 1995లో చంద్రబాబు నాయుడు హయాంలో వాటిని 34 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
న్యాయపోరాటం చేస్తాం
కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయం తీసుకుని సంబంధిత జీవోలు జారీ చేసిందని టీడీపీ నేతలు తెలిపారు. అయితే ఈ ప్రక్రియపై వైసీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
విలేకరుల సమావేశంలో రాష్ట్ర టీడీపీ వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె. ఎల్లప్ప, రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, షేక్ తదితరులు పాల్గొన్నారు.
