మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం

జిల్లా కలెక్టర్ పుండ్కర్, ఎమ్మెల్యే రవికుమార్

పొందూరు(ఆమదాలవలస), ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులని, వారిని కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు . పొందూరులోని సాయిబాబా వీవర్స్ సొసైటీ నూతన భవనంలో డీఆర్‌డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ఖాదీ క్లస్టర్ ఏర్పాటులో భాగంగా మహిళలకు 20 మగ్గాలపై నిర్వహించనున్న ఉచిత చేనేత శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం వారిరువురూ కలిసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆధునిక పద్ధతుల్లో నాణ్యమైన చీరల తయారీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొందూరు చేనేత సంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని .తెలిపారు గ్రామీణ ప్రాంత మహిళలకు స్థానికంగానే ఉపాధి మార్గాలు చూపిస్తూ ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు వివరించారు.

అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన డ్వాక్రా వ్యవస్థ వల్ల నేడు మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు లభిస్తున్నాయని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని కుటుంబాలకు ఆసరాగా నిలవాలని కూన రవికుమార్, స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు.

శిక్షణ పొందిన మహిళలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను సైతం సమకూరుస్తామని, పొందూరు ఖాదీ ప్రాశస్త్యాన్ని పునరుద్ధరిస్తూ చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని వెల్లడించారు. మహిళలు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, చేనేత రంగ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.